హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం నాడు మధ్యాహ్నం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో భేటీ అయ్యారు. 

రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల భర్తీ, సచివాలయం కూల్చివేత తదితర అంశాలపై సీఎం కేసీఆర్ గవర్నర్ తో చర్చించనున్నారు.

గవర్నర్ తమిళిసై ఈ నెల 6వ తేదీన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలతో సమీక్ష నిర్వహించాలని భావించారు. అయితే ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ కార్యక్రమాలు ఉండడంతో ఆ రోజు సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హాజరు కాలేదు. 

ఈ నెల 7వ  తేదీన ప్రైవేట్ ఆసుపత్రుల ప్రతినిధులతో తమిళిసై సమావేశమయ్యారు. అదే రోజు సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సమావేశమయ్యారు.

హైద్రాబాద్ లో ఓ ఆసుపత్రిలో కరోనా రోగులకు అందుతున్న వైద్యం, సౌకర్యాలపై తమిళిసై పరిశీలించిన విషయం తెలిసిందే.ఈ తర్వాతే కేసీఆర్ గవర్నర్ తమిళిసై సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకొంది.