ఈ నెల 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మంత్రులు, విప్‌లతో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని అంశాలపై అసెంబ్లీలో చర్చిద్దామని, ఎన్ని రోజులైనా సభను నిర్వహిద్దామని సూచించారు.

వాస్తవాలను వివరించేందుకు మంత్రులు సిద్ధం కావాలని ఆయన ఆదేశించారు. కరోనా పరిస్థితులు, శ్రీశైలం ప్రాజెక్ట్ ప్రమాదం, కొత్త రెవెన్యూ చట్టంపై చర్చకు ప్రతిపాదించాలని కేసీఆర్ సూచించారు.

రాయలసీమ ఎత్తిపోతల పథకం, జీఎస్టీ అమలుతో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై చర్చకు ప్రతిపాదించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అల్లర్లు, దూషణలకు అసెంబ్లీ వేదిక కారాదని ఆయన పునరుద్ఘాటించారు.

అసెంబ్లీ నిర్వహణలో గుణాత్మక మార్పులు రావాలని.. ఆచరణాత్మక సూచనలను స్వీకరించడానికి ప్రభుత్వం సదా సిద్ధంగా ఉంటుందని కేసీఆర్ స్పష్టం చేశారు. సభ్యులు వాస్తవ పరిస్థితికి అద్ధం పట్టేలా మాట్లాడాలని... ఈ నెల 7న టీఆర్ఎస్‌ఎల్పీ సమావేశం జరుగుతుందని ముఖ్యమంత్రి తెలిపారు.