తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఉద్యోగ సంఘాల భేటీ ముగిసింది. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే పీఆర్‌సీపై ప్రకటన ఉంటుందని సీఎం స్పష్టం చేయడంతో సచివాలయంలో ఉద్యోగ సంఘాలు సంబరాలు చేసుకుంటున్నాయి.

ఏపీలో ఇచ్చిన 27 శాతం కంటే ఎక్కువే పీఆర్‌సీని అమలు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చినట్లు ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. అలాగే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు వారు వెల్లడించారు.

గత కొంతకాలంగా తెలంగాణలో కొలువుల కొట్లాట నడుస్తోన్న నేపథ్యంలో కేసీఆర్ దీనికి ఫుల్‌స్టాప్ పెట్టారు. వయో పరిమితి పెంపుపైనా సీఎం స్పష్టమైన హామీ ఇచ్చారని... ఆ మాటకు కట్టుబడి ఉంటానని చెప్పారని ఉద్యోగ సంఘాలు వెల్లడించాయి.

ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగుల్ని స్వరాష్ట్రానికి తీసుకొచ్చేందుకు కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారని వారు తెలిపారు.