జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వందకు పైగా సీట్లు కచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. ప్రశాంతమైన వాతావరణం కావాలా..? లేక మతం పేరుతో కత్తులతో పొడుచుకునే హైదరాబాద్ కావాలో ప్రజలే ఆలోచించుకోవాలని కోరారు కేసీఆర్.

తెలంగాణకు టీఆర్ఎస్ శ్రీరామరక్ష అన్న ఆయన.. ప్రజలను కాపాడే బాధ్యత తమ పార్టీపైనే ఉందని సీఎం తేల్చి చెప్పారు. అటల్ బిహారీ వాజ్‌పేయ్ ప్రధానిగా వున్నప్పుడు అరుణ్ శౌరీని మంత్రిగా పెట్టి ప్రభుత్వ రంగ సంస్ధల్లో పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమాన్ని బీజేపీ ప్రారంభించిందని ఆయన చెప్పారు.

వాజ్‌పేయ్ ఏడు సంస్థలను ఖతం చేసిందని.. మన్మోహన్ సింగ్ 3, నరేంద్రమోడీ 23 సంస్ధలను లేకుండా చేశారని కేసీఆర్ అన్నారు. చివరికి బంగారు బాతు లాంటి ప్రపంచంలోనే అతిపెద్ద బీమా సంస్ధ ఎల్‌ఐసీని ఎందుకు ప్రైవేటీకరణ చేయాలని భావిస్తున్నారని కేసీఆర్ ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వానికి 2,600 కోట్ల డివిడెండ్ ఇచ్చిందని సీఎం గుర్తుచేశారు. గ్రామాల్లో సైతం ఎల్‌ఐసీ అంటే తెలుసునని, 40 కోట్ల మంది పాలసీ దారులున్నారని కేసీఆర్ చెప్పారు. విదేశీ కంపెనీలను దేశ ప్రజలపై రుద్దుతున్నారని సీఎం మండిపడ్డారు.

దేశంలోని అన్ని ప్రతిపక్షాలను కలుపుకుని పోయేలా బీజేపీపై పోరాటానికి దిగుతానని, తాను మొండిపట్టు పడితే ఎలా ఉంటుందో దేశానికి తెలుసునన్నారు. కోట్ల మంది విద్యుత్ రంగ కార్మికులు లీడర్ కోసం ఎదురుచూస్తున్నారని... డిసెంబర్ రెండో వారంలో హైదరాబాద్ కాన్‌క్లేవ్ ఉండొచ్చని చెప్పారు.

Also Read:మోడీ విధానాలకు కౌంటర్: డిసెంబర్ రెండో వారంలో కేసీఆర్ సమావేశం

ప్రభుత్వ రంగ సంస్ధల పట్ల మోడీ ప్రభుత్వం అవలంభిస్తున్న వైఖరి పట్ల, రైతాంగ వ్యతిరేక చర్యల పట్ల ఖచ్చితంగా దేశంలో గళమెత్తాలని కేసీఆర్ పేర్కొన్నారు. రైల్వే, ఎల్ఐసీ, బీహెచ్ఈఎల్, ఎన్‌టీపీసీ, బీఎస్ఎన్ఎల్, బీపీసీఎల్ కార్మికులకు అండగా టీఆర్ఎస్ ఉంటుందన్నారు.

అమ్మ పెట్టదు అడుక్కుని తినయదన్నట్లు కేంద్రం ఏ మాత్రం ఆదుకోలేదని.. ఇవ్వకున్నా, ఇచ్చామని చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్‌కు అనుకూల వాతావరణం వుందని కేసీఆర్ చెప్పారు.

హైదరాబాద్ అభివృద్ధి కోసం ఇప్పటి వరకు 65,000 కోట్లు కేటాయించామని.. ఈ విషయాన్ని టీఆర్ఎస్ నేతలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. భారతీయ రైల్వేలను తెగనమ్మేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కేసీఆర్ ఆరోపించారు.

రైల్వే స్టేషన్‌లో ఛాయ్ అమ్మానని చెప్పిన ప్రధానే... రైల్వేలను అమ్ముతున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. రైళ్లని ప్రైవేట్ పరం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని సీఎం ప్రశ్నించారు.

అబద్ధాన్ని వందసార్లు చెప్పి  ప్రజలను గోల్‌మాల్ చేసే కార్యక్రమాలు చూస్తున్నామన్నారు. సోషల్ మీడియాను యాంటీ సోషల్ మీడియాగా మార్చి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని కేసీఆర్ ఆరోపించారు.