Asianet News TeluguAsianet News Telugu

జాతీయ పార్టీ ఏర్పాటు: రేపు యాదాద్రికి కేసీఆర్


తెలంగాణ సీఎం కేసీఆర్ రేపు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటారు. దసరా రోజున జాతీయ పార్టీ పై కేసీఆర్ ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ ప్రకటనకు ముందే స్వామి వారిని కేసీఆర్ దర్శించుకోనున్నారు. 

Telangana CM KCR Leaves For Yadadri Temple Tomorrow
Author
First Published Sep 29, 2022, 2:29 PM IST

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ రేపు యాదాద్రికి వెళ్లనున్నారు. జాతీయ పార్టీ ఏర్పాటుకు ముందే యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని కేసీఆర్ దర్శించుకుంటారు.దసరా రోజున జాతీయ పార్టీ గురించి కేసీఆర్ ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ మేరకు దసరా రోజున టీఆర్ఎస్ శాసనసభపక్ష సమావేశంతో పాటు పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు.ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో యాదాద్రి శివాలయ ఉద్ఘాటనలో తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఆ తర్వాత రేపు కేసీఆర్ యాదాద్రికి వెళ్లనున్నారు. 

అక్టోబర్ 5వ తేదీన టీఆర్ఎస్ఎల్పీతో పాటు పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు కేసీఆర్. టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో జాతీయ పార్టీ ఏర్పాటుపై తీర్మానం చేయనున్నారు. ఆ తర్వాత జరిగే పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో జాతీయ పార్టీ ఏర్పాటు విషయమై కేసీఆర్ ప్రకటన చేసే అవకాశం ఉంది. అంతేకాదు జాతీయ పార్టీ కో ఆర్డినేటర్లను కూడా కేసీఆర్ ప్రకటించనున్నారు.  దసరా రోజున పలు పార్టీల జాతీయ నేతలను కూడా కేసీఆర్ ఆహ్వానించినట్టుగా సమాచారం. 

2024లో జరిగే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాకుండా అడ్డుకుంటామని కేసీఆర్ ప్రకటించారు. ఇందు కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు చేయాలని తలపెట్టారు. ఆయా రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితులపై కూడా కేసీఆర్ అధ్యయం చేశారు. ప్రశాంత్ కిషోర్ టీమ్  ఈ విషయమై కేసీఆర్ తో కలిసి పనిచేసింది. రైతులు, విద్యార్ధులు, మహిళలు, యువత ఏం కోరుకుంటున్నారనే విషయమై కేసీఆర్ టీమ్ అధ్యయనం చేసింది. ప్రజల డిమాండ్లను జాతీయ పార్టీ ఎజెండాలో కేసీఆర్ చేర్చనున్నారు.  ఈ విషయమై పార్టీ ముఖ్యులతో కేసీఆర్ చర్చిస్తున్నారు. ఫామ్ హౌస్ వేదికగా కేసీఆర్ పార్టీ ఏర్పాటుపై కసరత్తులు నిర్వహిస్తున్నారు.

also read:జాతీయపార్టీపై టీఆర్ఎస్ఎల్పీ తీర్మానం: దసరా నాడే కోఆర్డినేటర్లను ప్రకటించనున్న కేసీఆర్

పార్టీ ఏర్పాటు కంటే ముందుగానో ఆ తర్వాతో కేసీఆర్ యాగం నిర్వహించనున్నారు. 2018 ఎన్నికల ప్రచారానికి వెళ్లే ముందు కూడా కేసీఆర్ యాగం నిర్వహించిన విషయం తెలిసిందే. జాతీయ పార్టీని ప్రకటించిన తర్వాత ఢిల్లీ లేదా యూపీలో కేసీఆర్ బహిరంగ సభను నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ బహిరంగ సభలో తమ పార్టీ విధానాలను కేసీఆర్ ప్రకటించనున్నారు. మరో వైపు అక్టోబర్ లో విజయవాడలో జరిగే సీపీఐ జాతీయ మహసభల్లో కూడా కేసీఆర్ పాల్గొనే అవకాశం ఉంది.  పలు పార్టీల నేతలను కూడా సీపీఐ నేతలు మహసభలకు ఆహ్వానించారు.  ఈ మహాసభల వేదికగా బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాల కూటమిపై సంకేతాలను ఇవ్వాలని సీపీఐ భావిస్తుంది. దీంతో సీపీఐ మహసభలకు పలు పార్టీల నేతలను ఆ పార్టీ జాతీయ నాయకత్వం ఆహ్వానించింది. 


 

Follow Us:
Download App:
  • android
  • ios