హైద్రాబాద్‌లో 108, అమ్మఒడి వాహనాలు: ప్రారంభించిన సీఎం కేసీఆర్
హైద్రాబాద్ లోని నెక్లెస్ రోడ్డులో 108 అంబులెన్స్, అమ్మఒడి వాహనాలను తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ ప్రారంభించారు.
హైదరాబాద్: 108 అంబులెన్సులు, అమ్మఒడి వాహనాలను తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారంనాడు హైద్రాబాద్ లో ప్రారంభించారు.204 కొత్త 108 అంబులెన్స్ లు, 228 అమ్మఒడి వాహనాలు, 34 పరమపద వాహనాలను సీఎం కేసీఆర్ ఇవాళ ప్రారంభించారు. నెక్లెస్ రోడ్డులో కేసీఆర్ ఈ వాహనాలకు జెండా ఊపారు. ఈ వాహనాలను ప్రారంభించిన తర్వాత సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనకు వెళ్లారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో లక్ష జనాభాకు ఒక అంబులెన్స్ ఉండేది. అయితే ప్రస్తుతం 75 వేలకు ఒక అంబులెన్స్ ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.2014 లో 321 అంబులెన్సులు ఉంటే ఇప్పుడు వాటి సంఖ్య 455కి చేరుకుంది. 108 ఎమర్జెన్సీ అంబులెన్సు రెస్పాన్స్ టైం 30 నిమిసాల నుండి 15 నిమిషాలకు తగ్గింది.ప్రత్యేక ఎమర్జెన్సీ 108 అంబులెన్సులు 2014లో లేవు. అయితే ప్రస్తుతం ప్రత్యేక 108 అంబులెన్స్ లు జిల్లాకు ఒక్కటిని ప్రభుత్వం సమకూర్చింది.
నవజాత శిశువులకు అంబులెన్సులను జిల్లాకు ఒకటి చొప్పున ప్రభుత్వం మంజూరు చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు ఒక్క అంబులెన్స్ కూడ లేదు. జీపీఎస్, ఎండీటీ ద్వారా నిరంతరం పర్యవేక్షించనున్నారు. ప్రతి రోజు 2 వేల ఎమర్జెన్సీ కేసులకు ఈ అంబులెన్స్ ద్వారా సేవలు అందించనున్నారు. ఇప్పటి వరకు 44 లక్షల 60 వేల మందికి సేవలు అందించినట్టుగా రాష్ట్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అమ్మఒడి వాహనాలు రాష్ట్రంలో లేవు. కెసిఆర్ కిట్ లో భాగంగా 300 వాహనాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రతి రోజుకు 4 వేల గర్భిణీ స్త్రీలకు ఈ అంబులెన్స్ సేవలు అందిస్తున్నారు. ఇప్పటి వరకు 30 లక్షల గర్భిణీ స్త్రీలకు సేవలు అందించారు. పరమపద వాహనాలు తెలంగాణలో లేవు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 50 వాహనాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రతి రోజుకు సగటున 35 డెత్ కేసులకు సేవలు అందించనున్నాయి. ఇప్పటివరకు 74 వేల డెత్ కేసులకు సేవలు అందించినట్టుగా ప్రభుత్వం తెలిపింది.