ఉద్యోగుల పీఆర్సీ, ప్రమోషన్లు వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఆదివారం అధికారులతో ప్రగతి భవన్‌లో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన మాట్లాడుతూ... సీఎస్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ వెంటనే ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చలు జరపాలని స్పష్టం చేశారు కేసీఆర్.

వారం, పదిరోజుల్లోనే చర్చల ప్రక్రియను పూర్తి చేయాలని చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్‌కు సీఎం ఆదేశాలు జారీ చేశారు. కాగా సీఎం కేసీఆర్ కొద్దిరోజుల క్రితం ప్రభుత్వ ఉద్యోగులకు ఫోన్లు చేశారు.

జనవరి తొలి వారం నుంచి ప్రభుత్వ శాఖల్లో ప్రమోషన్ల ప్రక్రియ ప్రారంభమైన వేళ.. పలువురు ఉద్యోగుల అనుభవాలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

ప్రమోషన్ల విషయంలో నిబంధనలు పాటిస్తున్నారా..? డబ్బులు తీసుకుంటున్నారా..? ఇతరత్రా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? అని ఆయన ఆరా తీశారు.

శాఖల వారీగా ప్రమోషన్లకు అర్హులైన ఉద్యోగుల జాబితా తెప్పించుకున్న సీఎం.. ఇప్పటికే ప్రమోషన్లు పొందిన, పదోన్నతికి అర్హత ఉన్న పలువురు ఉద్యోగులకు స్వయంగా ఫోన్లు చేశారు.