ఓట్ల కోసం పెన్షన్లు ఇవ్వడం లేదు .. ధరణి తీసేస్తే , మళ్లీ దళారుల రాజ్యమే : కేసీఆర్
బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. ధరణి ఎందుకు తీస్తారు.. మళ్లీ దళారుల రాజ్యం తీసుకొస్తారా అని ఆయన మండిపడ్డారు. మళ్లీ బీఆర్ఎస్ వస్తుంది.. రాగానే రైతుబంధు 12 వేలు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.
బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం కోరుట్లలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగిస్తూ.. ఓటును అలవోగా, తమాషాగా వేస్తే జీవితం తలకిందులు అవుతుందన్నారు. ఎమ్మెల్యేల ద్వారా ప్రభుత్వాలు ఏర్పాటవుతాయని.. ఎమ్మెల్యేలను ఎన్నుకునేటప్పుడు ఆలోచించి ఓటు వేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమాన్ని కోరుట్ల ప్రజలు ముందుండి నడిపించారని ప్రశంసించారు.
ప్రజాస్వామ్య పరిణితి కాంక్షిస్తూ ముందుకు పోవాలని కేసీఆర్ అన్నారు. చేనేత, బీడీ కార్మికుల కష్టాలు తాను కళ్లారా చూశానని ఆయన గుర్తుచేశారు. ప్రజలు, రైతుల గురించి పార్టీలు ఏం చేశాయో ఆలోచించాలని.. తాము ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినవి 10 అయితే, చేసినవి 100 పనులు వున్నాయని కేసీఆర్ అన్నారు. ఏ ఒక్క రాష్ట్రంలోనూ బీడీ కార్మికులకు పెన్షన్లు ఇవ్వడం లేదని.. చేనేత కార్మికుల కోసం బడ్జెట్ పెంచుతామని, మరిన్ని కార్యక్రమాలు చేపడతామని సీఎం పేర్కొన్నారు.
గతంలో కరెంట్ కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడేవాళ్లని.. అన్ని వర్గాల వారికి 24 గంటలూ నాణ్యమైన కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేసీఆర్ తెలిపారు. మేనిఫెస్టోలో లేకపోయినా దళితబంధు తెచ్చామని.. వ్యవసాయాన్ని స్థిరీకరణ చేయాలని ఆలోచించాలని సీఎం పేర్కొన్నారు. రైతులకు కరెంట్, నీటి బిల్లులు తీసి పారేశామని కేసీఆర్ గుర్తుచేశారు. గతంలో నీటి తీరువా వుండేదని.. బీఆర్ఎస్ వచ్చాక నీటి తీరువా తీసేశామని సీఎం తెలిపారు.
ALso Read: 50 ఏళ్లు ఏం చేశారు, ఒక్క అవకాశమంటున్నారు: ఆర్మూర్ సభలో కాంగ్రెస్ పై కేసీఆర్ ఫైర్
ఎన్ని మోటార్లు పెట్టారని.. ఎవరైనా అడుగుతున్నారా అని కేసీఆర్ ప్రశ్నించారు. ధరణి ఎందుకు తీస్తారు.. మళ్లీ దళారుల రాజ్యం తీసుకొస్తారా అని ఆయన మండిపడ్డారు. రైతుబంధు పేరుతో కేసీఆర్ దుబారా చేస్తున్నారని ఒకరంటున్నారని.. ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని కాంగ్రెస్ అంటోందని కేసీఆర్ దుయ్యబట్టారు. మళ్లీ బీఆర్ఎస్ వస్తుంది.. రాగానే రైతుబంధు 12 వేలు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. ధరణి ఉంది కాబట్టే ఇవాళ రైతుల డబ్బులు బ్యాంకుల్లోకి నేరుగా వస్తున్నాయని కేసీఆర్ తెలిపారు.
ధరణి తీసేస్తామని రాహుల్ గాంధీ కూడా చెబుతున్నారని సీఎం ఫైర్ అయ్యారు. కథ మళ్లీ మొదటికి రావొద్దంటే మళ్లీ బీఆర్ఎస్ రావాలని కేసీఆర్ తెలిపారు. రైతులకు రైతుబంధు, రైతు బీమా ఇస్తున్నామని.. దశలవారీగా రైతుబంధును రూ.16 వేలు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. పెన్షన్‌ను వేల రూపాయలకు తీసుకెళ్లింది కేసీఆరేనని ఆయన తెలిపారు. ఓట్ల కోసం, మోసం చేసేందుకు పెన్షన్లు ఇవ్వడం లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. కొత్త కార్మికులకు కూడా వంద శాతం పెన్షన్ మంజూరు చేస్తానని సీఎం హామీ ఇచ్చారు.