75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని తెలంగాణ సీఎం కేసీఆర్ గోల్కోండ కోటలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఆయన ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
హైదరాబాద్:ఏడేళ్లలో స్థిరమైన ఆర్ధిక అభివృద్దితో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ గా నిలిచిందని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు.హైద్రాబాద్ గోల్కొండ కోటలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ దినోత్సవాన్ని పురస్కరించకొని ఆదివారం నాడు ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
దేశంలో కనీస అవసరాల కోసం ప్రజలు ఇంకా అల్లాడే పరిస్థితులే ఉన్నాయన్నారు. దేశం సాధించిన అభివృద్దిని సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. స్వరాష్ట్రం సాధించుకొన్న రోజు నుండి అన్ని రంగాల అభివృద్దిపై దృష్టి పెట్టామన్నారు.
విద్యుత్, తాగు, సాగునీటి సమస్యలు ఇప్పుడు లేవన్నారు. దేశానికే పలు పథకాల్లో తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని ఆయన చెప్పారు.యాదాద్రి పవర్ ప్లాంట్ అందుబాటులోకి వస్తే తెలంగాణ రాష్ట్రం విద్యుత్ లో మిగులు సాధ్యమౌతోందన్నారు.రాష్ట్ర జీఎస్‌డీపీలో 20 శాతం వ్యవసాయరంగం నుండి వస్తోందన్నారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత దండగ అనుకొన్న వ్యవసాయం పండుగలా మారిందని చెప్పారు.
