తెలంగాణ నూతన సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మంత్రులకు శుభవార్త చెప్పారు. పనుల నాణ్యతలో ఏమాత్రం రాజీపడొద్దని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు

నూతన సచివాలయంలో మంత్రులకు కేటాయించిన శాఖలన్నీ ఒకే చోట వుండేలా చర్యలు తీసుకుంటామన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. శుక్రవారం కొత్త సచివాలయం నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. ఆయా శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్యకు అనుకూలంగా కార్యాలయాలు ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం కేసీఆర్ అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని పరిశీలించారు. సచివాలయ నిర్మాణ పనులు పూర్తికావొచ్చాయని.. పనుల నాణ్యతలో ఏమాత్రం రాజీపడొద్దని ఆయన అధికారులను ఆదేశించారు. అంబేద్కర్ విగ్రహం పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. అయితే అమరవీరుల స్థూపం పనులపై కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. 

ఇదిలావుండగా .. తెలంగాణ కొత్త సచివాలయాన్ని ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీన ప్రారంభించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణ సచివాలయం నిర్మాణ పనులకు 2019 జూన్ 27న కేసీఆర్ భూమి పూజ నిర్వహించారు. సుమారు ఏడు లక్షల చదరపు అడుగుల స్థలంలో కొత్త సచివాలయాన్ని నిర్మించారు. గత ఏడాది దసరా నాటికే సచివాలయాన్ని ప్రారంభించాలని భావించారు. కానీ అప్పటికీ కూడా పనులు పూర్తి కాలేదు. దీంతో కేసీఆర్ పుట్టిన రోజున సచివాలయాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో కొత్త సవివాలయ ప్రారంభం వాయిదా పడింది.

Also REad: తెలంగాణ సచివాలయ ప్రారంభానికి ముహుర్తం ఖరారు: ఏప్రిల్ 30న ప్రారంభం

కొత్త సచివాలయం పార్కింగ్ స్థలంలో 300 కార్లు, ఆరు వందల ద్విచక్రవాహనాలు పార్క్ చేసే అవకాశం ఉంది. మొదటి అంతస్థులో ఫోటో గ్యాలరీ, మ్యూజియం, ఆర్ట్ గ్యాలరీ , రెండు, మూడో అంతస్థుల్లో కన్వెన్షన్లు సెంటర్లు, రెస్టారెంట్లు ఉంటాయి. ఏడో అంతస్థులో సీఎం కేసీఆర్ చాంబర్ ఉంటుంది.