Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ సాఫ్ట్, మోడీతో డీల్: ఎజెండాను పక్కన పెట్టిన బాబు

నీతి ఆయోగ్ సమావేశంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెరో దారి ఎంచుకున్నారు.

Telangana CM KCR goes soft on PM

న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ సమావేశంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెరో దారి ఎంచుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మెతగ్గా మాట్లాడగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎజెండాను పక్కన పెట్టి కేంద్రంపై విమర్శలు చేశారు. 

ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఆదివారం జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో కేసిఆర్ మాట్లాడిన తీరు బిజెపితో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) దోస్తీ చేస్తుందనే విమర్శలకు ఊతమిచ్చే విధంగా ఉంది. 

ఆంధ్రప్రదేశ్ ను కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని అంటూ విభజన హామీలను అమలు చేయకపోవడాన్ని, రాష్ట్రానికి ఇచ్చిన హామీలను విస్మరించడాన్ని చంద్రబాబు లేవనెత్తారు. కేసీఆర్ తెలంగాణ విషయంలో ఆ ప్రస్తావనే తేలేదు.

కేసిఆర్ తాను మాట్లాడిన ఏడు నిమిషాల్లో రైతుల కోసం అమలు చేస్తున్న పథకాలను, నీటి పారుదుల ప్రాజెక్టులను ప్రస్తావించారు. చంద్రబాబు ఎజెండాను పక్కన పెట్టి ఎపికి చేసిన అన్యాయంపై ప్రసంగించారు. 

కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ అభ్యంతరం చెప్పినప్పటికీ వినకుండా సమయం కోరుతూ చంద్రబాబు 20 నిమిషాల పాటు మాట్లాడారు జిఎస్టీపై, 15వ ఆర్థిక సంఘం నియమావళి ప్రతిపాదనలు, ఎపి పునర్వ్యస్థీరకరణ చట్టం హామీలపై కేంద్రం మీద విరుచుకుపడ్డారు.

తెలంగాణకు ఇచ్చిన హామీలను కూడా కేంద్రం నెరవేర్చలేదు. బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం తదితర హామీలను కేంద్రం ఇప్పటి వరకు అమలు చేయలేదు. వీటిని కేసీఆర్ ప్రస్తావించలేదు. 

కేంద్ర వైఖరి వల్ల రాష్ట్రాలు ఎదుర్కుంటున్న ఇబ్బందులను కేసీఆర్ ప్రస్తావిస్తారని భావించారు. కానీ కేసీఆర్ ఆ విషయాలను అసలు పట్టించుకోలేదు. కేసీఆర్ మెతక వైఖరిని బట్టి బిజెపి, టీఆర్ఎస్ మధ్య రహస్య అవగాహన ఉందనేది తేలిపోయిందని కాంగ్రెసు పార్టీ విమర్శిస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios