ఫామ్‌హౌస్‌లో రాజ్యసభ అభ్యర్థులపై కేసీఆర్ కసరత్తు.. ప్రకాష్ రాజ్‌కు సీటు ఖాయమేనా?.. రేసులో ఉన్నది వీళ్లే..!
తెలంగాణలోని మూడు రాజ్యసభ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో ఉన్న బలబలాలను పరిశీలిస్తే.. ఆ మూడు స్థానాలు కూడా గులాబీ పార్టీ ఖాతాలోకి వెళ్లనున్నాయి. దీంతో సీఎం కేసీఆర్.. మూడు రాజ్యసభ స్థానాలకు పార్టీ అభ్యర్థులను ఖరారు చేసేందుకు కసరత్తు జరుపుతున్నారు.
తెలంగాణలోని మూడు రాజ్యసభ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం వేర్వేరుగా నోటిఫికేషన్‌లు జారీచేసింది. ఇందులో బండ ప్రకాష్ రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి నామినేషన్లు దాఖలు చేయడానికి మే 19 చివరి తేదీ కాగా.. ధర్మపురి శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు పదవీ కాలం ముగియనున్న స్థానాలకు జరగనున్న ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు మే 31 చివరి తేదీ. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో ఉన్న బలబలాలను పరిశీలిస్తే.. ఆ మూడు స్థానాలు కూడా గులాబీ పార్టీ ఖాతాలోకి వెళ్లనున్నాయి. దీంతో ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పడ్డారు.
గత వారం రోజులుగా ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌస్‌లో ఉన్న సీఎం కేసీఆర్.. మూడు రాజ్యసభ స్థానాలకు పార్టీ అభ్యర్థులను ఖరారు చేసేందుకు కసరత్తు జరుపుతున్నారు. 10 మందికి పైగా ఆశావహులు ఉండగా.. వారిలో ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై కేసీఆర్ సమాలోచనలు జరుపుతున్నారు. మే 19లోపే సీఎం కేసీఆర్.. ముగ్గురు అభ్యర్థుల పేర్లను ఖరారు చేయనున్నట్టుగా సమాచారం. బండ ప్రకాష్ రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి నామినేషన్ల చివరి తేదీకి ఒక రోజు ముందు అంటే.. మే 18న కేసీఆర్.. అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. అయితే అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమీకరణాలపై కేసీఆర్ దృష్టి సారించారు. మూడు స్థానాలకు.. దళిత, బీసీ, ఓసీ వర్గాల నుంచి ఒక్కొక్కరి చొప్పున ఎంపిక చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్టుగా టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.
బండ ప్రకాష్ స్థానంలో సినీ నటుడు ప్రకాష్ రాజ్‌కు కేసీఆర్ అవకాశం ఇస్తారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇటీవల ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌస్‌లో ఉంటున్న కేసీఆర్‌ను ప్రకాష్ రాజ్ ఇటీవల వెళ్లి కలవడంతో.. ఈ ప్రచారం మరింత జోరందుకుంది. పెద్దల సభలో పార్టీ తరఫున సమర్ధవంతంగా ప్రాతినిధ్యం వహించే నాయకుడు కావాలని గులాబీ బాస్ కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రకాష్ రాజ్ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రకాష్ రాజ్ హిందీ, ఇంగ్లీషు, దక్షిణాది భాషల్లో ఉన్న ప్రావీణ్యం, జాతీయ స్థాయిలో గుర్తింపును క్యాష్ చేసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇటీవల కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో పర్యటనలకు వెళ్లిన సందర్భాల్లో ప్రకాష్ రాజ్ కీలకంగా వ్యవహరించారు. గతంలో కేసీఆర్ కర్ణాటకలో పర్యటించిన సమయంలో, ఇటీవల కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనలో ప్రకాష్ రాజ్ కనిపించిన సంగతి తెలిసిందే. మరోవైపు టీఆర్ఎస్ అగ్రనేతలతో ప్రకాష్ రాజ్‌కు సత్సబంధాలు ఉన్నాయి. ప్రకాష్ రాజ్‌కు ఇంతలా ప్రాధాన్యం ఇస్తున్న కేసీఆర్.. ఆయనను రాజ్యసభకు పంపాలని ఫిక్స్ అయినట్టుగా టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రకాష్ రాజ్ మాత్రం పెద్దల సభకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదని.. అయితే ఆయనను ఒప్పించేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని సమాచారం.
దళిత అభ్యర్థుల విషయానికి వస్తే.. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, మాజీ ఎంపీ మందా జగన్నాధం రేస్‌లో ఉన్నారు. అయితే మోత్కుపల్లి రాజ్యసభ హామీతోనే టీఆర్ఎస్‌లో చేరినట్టుగా గతంలో ప్రచారం సాగిన సంగతి తెలిసిందే. ఒకవేళ సీఎం కేసీఆర్.. ఈ కోటాలో గిరిజన అభ్యర్థిని నిలపాలని భావిస్తే మాత్రం మాజీ ఎంపీ సీతారాం నాయక్‌కు అవకాశం కల్పించే చాన్స్ ఉంది. మరి కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.
ఓసీ అభ్యర్థి విషయానికి వస్తే నమస్తే తెలంగాణ పత్రిక సీఎండీ దీవకొండ దామోదర్‌రావు, మాజీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. దామోదర్ రావు గతంలోనే టీఆర్ఎస్ తరఫున రాజ్యసభకు వెళ్లాలని ప్రయత్నాలు చేశారు. కానీ కులాల లెక్కలు కుదరకపోవడం, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా కేసీఆర్ ఆయనకు అవకాశం కల్పించలేదు. మరోవైపు కెప్టెన్ లక్ష్మీకాంతరావు స్థానంలో బ్రాహ్మణ కోటా కింద రాజ్యసభ బెర్త్ కోసం వ్యాపారవేత్త సీఎల్ రాజం కూడా లాబీయింగ్ చేస్తున్నారు. హెటిరో పార్థ సారథి రెడ్డి కూడా రాజ్యసభ బెర్త్ కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా సమాచారం.
గతంలో టీఆర్ఎస్ తరఫున కీలకంగా వ్యవహరించిన బోయినపల్లి వినోద్‌కుమార్ కూడా రాజ్యసభ బెర్త్ దక్కవచ్చనే ఊహాగానాలు వెలువడినప్పటికీ.. ఆయన అందుకు ఆసక్తి లేరని తెలుస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల ఓడిన వినోద్ కుమార్.. ప్రస్తుతం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అయితే వినోద్ కుమార్ 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతన్నాయి. ఇక, బీసీ సామాజిక వర్గం నుంచి మరో ఇద్దరి పేర్లు కూడా సీఎం కేసీఆర్ పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.