అటవీశాఖలో దొంగలు తయారయ్యారని తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ములుగు డీఎఫ్‌వో ప్రదీప్ కుమార్ శెట్టిని మందలించారు. 

ములుగు జిల్లా (mulugu district) ఏటూరు నాగారం జరిగిన సమీక్షలో అటవీ శాఖ అధికారులపై (forest department) ఫైర్ అయ్యారు సీఎం కేసీఆర్ (cm kcr) . అటవీశాఖలో దొంగలు తయారయ్యారని.. ఒక్క చెట్టయినా వుందా, అన్ని అమ్ముకు దొబ్బారని సీఎం ఘాటు వ్యాఖ్యలు చేశారు. ములుగు డీఎఫ్‌వో ప్రదీప్ కుమార్ శెట్టిని ముఖ్యమంత్రి మందలించారు. అటవీ ప్రాంతంలో రోడ్లు వేయనీయం.. బ్రిడ్జి కట్టనీయం , కరెంట్ పోల్ వేయనీయమనడం మంచిది కాదన్నారు. శాపలి బ్రిడ్జ్ నిర్మాణాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు సౌకర్యం లేక రేషన్ ఇవ్వలేక, కలెక్టర్, ప్రజలు చావాలా అని నిలదీశారు. 

అంతకుముందు భద్రాచలం పట్టణంలో వరద పరిస్థితిపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం నాడు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష తర్వాత సీఎం కేసీఆర్ మాట్లాడారు. వరదలు వచ్చినప్పుడల్లా భద్రాచలం వాసులు ముంపునకు గురికావడం బాధాకరమని కేసీఆర్ అన్నారు. శాశ్వత కాలనీల నిర్మాణం కోసం ఎత్తైన ప్రదేశాలను గుర్తించాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. భద్రాచలం వద్ద గోదావరికి భారీగా వరద వచ్చినప్పటికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకున్నందుకు సీఎం అభినందించారు. వరద వచ్చినప్పుడల్లా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని తిరిగే పరిస్థితులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకొంటామన్నారు. 

భద్రాచలం ముంపు బాధితులకు శాశ్వత కాలనీలు, క్లౌడ్ బరస్ట్ అనుమానాలు: కేసీఆర్

కడెం ప్రాజెక్టుకు ఏనాడు రాని రీతిలో 5 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందన్నారు.ఈ ప్రాజెక్టును దేవుడే కాపాడినట్టుగా కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఇతర దేశాలకు చెందిన వారు మన దేశంలో క్లౌడ్ బరస్ట్ చేస్తున్నారనే ప్రచారం కూడా ఉందన్నారు. గతంలో కాశ్మీర్ లోని లడ్డాఖ్, ఆ తర్వాత ఉత్తరాఖండ్, ప్రస్తుతం గోదావరిపై క్లోడ్ బరస్ట్ చేశారనే అనుమానాలు కూడా ఉన్నాయన్నారు. దీని వెనుక వీదేశీ శక్తుల ప్రమేయం ఉందనే అనుమానాలు వ్యక్తం చేశారు. క్లోడ్ బరస్ట్ అనే కొత్త పద్దతి వచ్చిందని చెబుతున్నారన్నారు. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని సీఎం కేసీఆర్ చెప్పారు.