బ్యాంకుల్లో అప్పులు తీసుకుని ముంచేవాళ్లకు ఇస్తున్నారని..  బీజేపీ (bjp) పాలన అంటే దేశాన్ని అమ్మడమేనంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ (kcr) ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి సిగ్గూశరం కూడా లేదని.. దేశం అభివృద్ధి సాధించాలంటే ఈ పార్టీని కూకటివేళ్లతో పెకిలించి పారేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఉద్యమిస్తామని సీఎం పేర్కొన్నారు. 


బ్యాంకుల్లో అప్పులు తీసుకుని ముంచేవాళ్లకు ఇస్తున్నారని.. బీజేపీ (bjp) పాలన అంటే దేశాన్ని అమ్మడమేనంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ (kcr) ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు మత పిచ్చి లేపి ఓట్లు రాబట్టుకుంటున్నారని.. ప్రపంచ హంగర్ ఇండెక్స్‌లో నేపాల్, బంగ్లాదేశ్ కంటే అధ్వాన్నంగా భారత్ వుందని కేసీఆర్ అన్నారు. ప్రపంచ హంగర్ ఇండెక్స్‌లో 101వ స్థానంలో వున్నామని.. ఇలాంటి సమయంలో రూ.65 వేల కోట్లు ఆహార సబ్సిడీ తగ్గించారని సీఎం పేర్కొన్నారు. ఎల్‌ఐసీని అమ్మేస్తున్నామని బడ్జెట్‌లో చెప్పారని.. ఎల్‌ఐసీని ఎందుకు అమ్ముతున్నారని కేసీఆర్ ప్రశ్నించారు. అమెరికా బీమా కంపెనీలకు బ్రోకర్లుగా వ్యహరిస్తున్నారా.. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారని, చేశారా అని దుయ్యబట్టారు. ఆదాయాన్ని కాదు, పెట్టుబడి వ్యయాన్ని రెట్టింపు చేశారని.. అందరికీ ఇళ్లిస్తామన్నారని ఇచ్చారా అని ప్రశ్నించారు. విదేశాల్లోని నల్లధనం తీసుకొస్తామన్నారు.. తెచ్చారా అని కేసీఆర్ నిలదీశారు. ఒక్కొక్కరికి 15 లక్షలిస్తామన్నారు.. ఎవరికైనా ఇచ్చారా అని సీఎం మండిపడ్డారు. 

బీజేపీకి సిగ్గూశరం కూడా లేదని.. దేశం అభివృద్ధి సాధించాలంటే ఈ పార్టీని కూకటివేళ్లతో పెకిలించి పారేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఉద్యమిస్తామని సీఎం పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ హైదరాబాద్‌కు వస్తే మోడీకి నిద్ర పట్టడం లేదని.. అహ్మదాబాద్‌లో కాకుండా హైదరాబాద్‌లో ఎందుకు పెడుతున్నారంటూ ప్రధాని అడ్డుకునే ప్రయత్నం చేశారని కేసీఆర్ ఆరోపించారు. ప్రధాని ఇంత నీచంగా వ్యవహరిస్తారా.. బడ్జెట్‌లో నదుల అనుసంధానం మిలియనీయం జోక్ అంటూ సీఎం సెటైర్లు వేశారు. 

క్రిప్టో కరెన్సీని అధికారికంగా గుర్తిస్తున్నారా..? అధికారికంగా గుర్తించకుండా 30 శాతం పన్ను ఎలా వేస్తారని కేసీఆర్ ప్రశ్నించారు. కృష్ణా- గోదావరి అనుసంధానానికి మీ ప్రాతిపదిక ఏంటీ..? అని సీఎం నిలదీశారు. తెలుగు రాష్ట్రాల్లో గోదావరి జలాలపై ఇక్కడి ప్రభుత్వాలకే అధికారముందని ట్రిబ్యూనల్ చెప్పిందని కేసీఆర్ గుర్తుచేశారు. నదుల అనుసంధానంపై ఎవరినైనా సంప్రదించారా.. దేశంలో నీళ్ల కరువు వుండటానికి వీల్లేదని నీతి ఆయోగ్ మీటింగ్‌లో చెప్పానని సీఎం గుర్తుచేశారు. దేశంలో 65 వేల టీఎంసీల నీరు వుందని.. ఇప్పటికీ 35 వేల టీఎంసీలు కూడా వాడుకోవడం లేదని కేసీఆర్ దుయ్యబట్టారు. అభివృద్ధి చెందే రాష్ట్రాల కాళ్లల్లో కట్టెలు పెట్టొద్దని చాలాసార్లు చెప్పామని... ఇండియాలో ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని చూడలేదని సీఎం ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

జల్‌శక్తి మిషన్ అంతా బోగస్సేనంటూ కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రామానుజాచార్య సమతామూర్తి విగ్రహాన్ని మోడీ నిర్మించినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని.. ఎనిమిదేళ్లలో తెలంగాణకు వచ్చిన కేంద్ర సాయం ఒక్క రైతబంధుకు సమానం కాదన్నారు. 317 జీవో చాలా గొప్ప జీవో అని .. దాని గురించి బీజేపీ పోరాటం చేస్తామనని చెబుతోందని ఆయన ధ్వజమెత్తారు. అసలు ఈ జీవో ఏంటో ఈ బీజేపీ నేతలకు తెలుసా అని కేసీఆర్ ప్రశ్నించారు. స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు రావాలని 317 జీవో తీసుకొచ్చామని.. ఎక్కడివారికి అక్కడ ఉద్యోగాలు రావాలనే కొత్త జిల్లాలు, జోన్‌లు చేశామని సీఎం తెలిపారు. ఈ దేశాన్ని చెత్త ప్రభుత్వం పాలిస్తోందంటూ సీఎం మండిపడ్డారు. దేశంలో తెలంగాణ అభివృద్ధిలో నెంబర్ వన్ స్థానంలో వుందన్నారు.