తెలంగాణ అసెంబ్లీలో ప్రసంగించిన కేసీఆర్.. నీళ్లు, నిధులు, నియమాకాలే తమ ఉద్యమ ఎజెండా అని కేసీఆర్ గుర్తు చేశారు. నీళ్లు కూడా తెచ్చుకొన్నామన్నారు. ఇంకా కూడా తెలంగాణ వాటా సాధించుకొనే వరకు పోరాటం చేస్తామన్నారు. విభజన చట్టంలోని 9, 10 షెడ్యూళ్లకు చెందిన ఉద్యోగుల విభజన ఇంకా తెగలేదని చెప్పారు.
అసెంబ్లీ వేదికగా ఉద్యోగాల భర్తీకి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో తక్షణమే 80,039 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తున్నట్టుగా కేసీఆర్ ప్రకటించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత కూడా ఎదురవుతున్న కొన్ని ఇబ్బందుల గురించి కేసీఆర్ ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. పరోక్షంగా సీఎం జగన్‌కు చురకలు అంటించారు. కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది దేశ చరిత్రలో ప్రత్యేక ఘట్టమన్నారు.
హైదరాబాద్ తొలుత ఒక దేశంగా, ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్రంగా ఉందన్నారు. ఆ తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతర్భాగంగా ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వివక్ష, అన్యాయాలతో తెలంగాణ నలిగిపోయిందన్నారు. వేరే పార్టీలకు రాజకీయాలంటే గేమ్ అని చెప్పారు. కానీ రాజకీయాలంటే తమకు ఓ టాస్క్ అని కేసీఆర్ చెప్పారు. నీళ్లు, నిధులు, నియమాకాలే తమ ఉద్యమ ఎజెండా అని కేసీఆర్ గుర్తు చేశారు. నీళ్లు కూడా తెచ్చుకొన్నామన్నారు. ఇంకా కూడా తెలంగాణ వాటా సాధించుకొనే వరకు పోరాటం చేస్తామన్నారు. గోదావరి జలాలను ఇప్పటికే సాధించుకొన్నామని చెప్పారు. నీటీ వాటాల కోసం పోరాటం చేస్తామన్నారు.
‘కొత్త రాష్ట్రం ఆవిర్భావం అనేది భౌగోళిక విభజనతోపాటు ఉద్యోగులు , ఆస్తుల విభజనతో కూడుకున్న ప్రక్రియ. ప్రభుత్వ సంస్థలు మాత్రమేగాక
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ చట్టంలోని 9, 10 షెడ్యూళ్ల కింద పేర్కొన్న ప్రభుత్వ పరిధిలోని వివిధ వాణిజ్య సంస్థలు, ఇతర సంస్థలకు చెందిన ఆస్తుల, ఉద్యోగుల
విభజన కూడా ముడిపడి ఉంది. అయితే ఈ ప్రక్రియకు కేంద్రప్రభుత్వ ఆదేశాలతో సంబంధం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సృష్టిస్తున్న అర్థరహిత వివాదాలు, కాలికేస్తే మెడకు, మెడకేస్తే కాలికి వేసినట్టుండే దుర్మార్గ వైఖరి, దీనికితోడు కేంద్రం బాధ్యతారాహిత్యం వల్ల ఈ ప్రక్రియ ఇప్పటికీ పూర్తి కాలేదు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ కేంద్రంగా ప్రణాళికలను, విధానాలను రూపొందించుకున్నాం. తెలంగాణ అవసరాలకు తగిన విధంగా పరిపాలన సంస్కరణలను అమల్లోకి తెచ్చాం. వివిధ శాఖలను పునర్వ్యవస్థీకరణ చేసి, బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకున్నాం’ అని కేసీఆర్ అన్నారు. విభజనకు సంబంధించి అపరిషృతంగా ఉన్న సమస్యలు పరిష్కారం అయితే.. మరికొన్ని ఉద్యోగాలు కూడా భర్తీ చేసేందుకు అవకాశం ఉండేందని చెప్పుకొచ్చారు.
ఇక, ముల్కీ రూల్స్ స్పూర్తితో శాశ్వత ప్రాతిపదికన 95 శాతం ఉద్యోగాలు స్థానికులు పొందేలా రాష్ట్రపతి ఉత్తర్వులు తీసుకొచ్చామని సీఎం కేసీఆర్ చెప్పారు. గతంలో తెలంగాణ భాష మాట్లాడితే జోకర్‌లా చూసేవారని, ఇప్పుడు తెలంగాణ భాష మాట్లాడితేనే సినిమా సక్సెస్ అవుతుందని కేసీఆర్ అన్నారు.
