ముస్లిం సోదరులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. విద్యా, ఉపాధితో పాటు పలు రంగాల్లో ముస్లింలకు తమ ప్రభుత్వం ఆసరాగా నిలిచిందని కేసీఆర్ అన్నారు. 

ముస్లిం సోదరులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేళ్లుగా ముస్లింల సంక్షేమం, అభివృద్ధి కోసం దాదాపు రూ.13 వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. అల్లా దీవెనలతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా వుండాలని, ప్రజలంతా కలిసి మెలిసి సుఖ సంతోషాలతో జీవించేలా భగవంతుని ఆశీర్వాదాలు అందాలని కేసీఆర్ ఆకాంక్షించారు. 

గంగా జమునా సంస్కృతికి తెలంగాణ గడ్డ ఆలవాలమని, లౌకికవాదాన్ని, మత సామరస్యాన్ని కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి వుందన్నారు. విద్యా, ఉపాధితో పాటు పలు రంగాల్లో ముస్లింలకు తమ ప్రభుత్వం ఆసరాగా నిలిచిందని కేసీఆర్ తెలిపారు. ముస్లిం సోదరుల జీవితాల్లో గుణాత్మక మార్పు కోసం తాము అమలు చేస్తున్న పథకాలు సత్ఫలితాలను ఇస్తున్నామని సీఎం అన్నారు. మైనారిటీ అభివృద్ధి కోసం తాము చేపట్టిన కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న ముస్లిం మైనారిటీ అభివృద్ధి మోడల్‌ను దేశవ్యాప్తంగా విస్తరింపజేసేందుకు కృషి చేస్తామని కేసీఆర్ తెలిపారు. 

షాదీ ముబారక్ పథకం కింద ప్రభుత్వం 2014-15 నుంచి 2022-23 మధ్య కాలంలో రూ. 2,130.92 కోట్లు ఖర్చు చేసిందని ఆయన పేర్కొన్నారు. మొదటి దశలో 204 మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు స్థాపించామని.. వాటిని మైనారిటీ రెసిడెన్షియల్ కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేశామని కేసీఆర్ గుర్తుచేశారు. మొత్త 204 సంస్థల్లో 107 బాలురకు, 97 బాలికలకు కేటాయించామని వీటిలో మొత్తం 1,30,560 మంది (బాలురు 68,480 .. బాలికలు 62,800) వున్నట్లు సీఎం చెప్పారు. సీఎం ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకం కింద రూ.20 లక్షలు, వన్ వే విమాన ఛార్జీ కింద రూ.60,000లను విదేశాల్లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్, డాక్టోరల్ కోర్సులను అభ్యసించే విద్యార్ధులకు స్కాలర్‌షిప్‌గా అందిస్తున్నట్లు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.