తెలంగాణ తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఓటు హక్కు వినియోగించుకోలేదు. సీఎంతో ఆయన సతీమణి శోభకు స్వగ్రామమైన సిద్దిపేట జిల్లా చింతమడకలో ఓటు హక్కు వున్న సంగతి తెలిసిందే. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లోనే చింతమడక గ్రామానికి కూడా ఎన్నికలు జరిగాయి.

అయితే ఎన్నిక సమయానికి కేసీఆర్ సతీసమేతంగా ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్‌లో ‘‘సహస్ర మహా చండీయాగంలో’’ ఉన్నారు. దీంతో ముఖ్యమంత్రి దంపతులు ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి ఆధ్వర్యంలో కేసీఆర్ ఐదు రోజుల పాటు చండీయాగాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 

మరోవైపు తెలంగాణ తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎదురు లేకుండా దూసుకెళ్లింది. ఆ పార్టీ మద్ధతు ప్రకటించిన అధ్యర్థులు భారీ సంఖ్యలో గెలుపొందారు. తొలి దశలో 4, 479 గ్రామ పంచాయతీల ఎన్నికకు నోటీసులు ఇవ్వగా... 769 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 3701 పంచాయతీల్లో ఎన్నికల సంఘం పోలింగ్ జరిపింది. వీటిలో మొత్తం 2,629 పంచాయతీలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది.