కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. కేంద్ర, రాష్ట్రాలు బాగుంటేనే దేశం బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే కేంద్రంలో కొంత గడబిడ వుందని.. దానికి చికిత్స చేయాల్సిన అవసరం వుందన్నారు.
రాష్ట్రంలో పరిస్థితులు అద్భుతంగా వున్నాయని.. కేంద్రంలో మాత్రం పరిస్థితులు బాగో లేవని కేసీఆర్ (kcr) దుయ్యబట్టారు. రంజాన్ (ramadan 2022) పర్వదినాన్ని పురస్కరించుని శుక్రవారం హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియంలో (lb stadium) రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. కేంద్రంలో కొంత గడబిడ వుందని.. అక్కడ కొంత రోగం వుందని, దానికి చికిత్స చేయాల్సిన అవసరం వుందని సీఎం తెలిపారు. తెలంగాణ కూడా దేశంలో భాగమేనని.. దేశం, రాష్ట్రం బాగుంటేనే ప్రజలందరూ బాగుంటారని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. 2014లో రాష్ట్ర పర్ క్యాపిటా ఇన్‌కమ్‌తో పోలిస్తే, ఇప్పుడు పెరిగిందని సీఎం గుర్తుచేశారు. మన పర్ క్యాపిటా ఇన్‌కమ్‌లో సగం కూడా దేశానిది లేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కేంద్రం బలహీనంగా వుంటే రాష్ట్రం కూడా బలహీనంగానే వుంటుందని ముఖ్యమంత్రి అన్నారు. ఏ పరిస్థితుల కారణంగానైనా కేంద్రంలో గడబిడ వుంటే కచ్చితంగా దానిని ఆపాలని.. గాడిలో పెట్టాలని కేసీఆర్ గుర్తుచేశారు.
కొన్నేళ్ల క్రితం తెలంగాణ వాతావరణం చాలా ఇబ్బందిగా వుండేదన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. మీ అందరి సహకారం వల్ల తెలంగాణ పరిస్థితి మారిపోయింద్నారు. తెలంగాణ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని.. భారత దేశం మొత్తం నేడు అంధకారంలో వుందని కేసీఆర్ గుర్తుచేశారు. కానీ తెలంగాణ మాత్రం విద్యుత్ కాంతులతో విరాజిల్లుతోందన్నారు. తాగేనీరు గానీ, వ్యవసాయం గానీ, పండే పంటలో కూడా తెలంగాణ మంచి ఫలితాలను సాధించిందని సీఎం గుర్తుచేశారు. మైనారిటీ పిల్లల కోసం అద్భుతమైన రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మించామని... అన్ని వసతులూ కల్పించామని ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన తీరుగానే.. దేశం మొత్తం కూడా ఇదే విధానాన్ని అవలంబించాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.
తెలంగాణ ఇంత అభివృద్ది పథంలో వున్నందుకు ఆయన హర్షం వ్యక్తం చేశారు. దేశం మొత్తంలోనే 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందిందని... ప్రతి రంగానికీ నాణ్యమైన విద్యుత్‌నే అందిస్తున్నామని కేసీఆర్ చెప్పారు. అయితే ఇది ఏమాత్రం సరిపోదని.. ఇంకా అభివృద్ధి సాధించాల్సి వుందని ఆ దిశగానే అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.
