మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలనే పండించాలని మరోసారి రైతులకు స్పష్టం చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. వ్యవసాయ శాఖ ఇందుకోసం ప్రణాళికలు రూపొందించాలని సూచించిన ముఖ్యమంత్రి.. ఈ ఏడాది వర్షాకాలంలోనే నియంత్రిత పంటల సాగు మొదలవ్వాలని తెలిపారు.

Also Read:నూతన వ్యవసాయ పాలసీపై ఈ నెల 21న కేసీఆర్ కీలక మీటింగ్

ప్రతీ సీజన్‌లో ఇదే విధంగా కొనసాగాలని.. సూచనలు ఇచ్చేందుకు గాను వ్యవసాయ అధ్యయన కమిటీ వేయాలని కేసీఆర్ ఆదేశించారు. త్వరలోనే కాటన్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామని, పంటల కాలనీ కోసం నేలల విభజన జరుగుతుందని ముఖ్యమంత్రి వెల్లడించారు.

ఆలూ, అల్లం, వెల్లుల్లిపాయల సాగును ప్రోత్సహించాలని.. పంటల లెక్కల నమోదు కోసం ప్రత్యేకంగా విభాగం వుండాలని అధికారులకు సీఎం సూచించారు. మార్కెట్లో అమ్ముడుపోయే పంటను పండించడం వల్ల వ్యవసాయం లాభసాటిగా మారుతుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

Also Read:నియంత్రిత సాగు విధానానికి బోణికొట్టిన సిద్దిపేట

దీని వల్ల పంటలకు ధర రాని దుస్థితి ఉండదన్నారు. రైతు లాభం కోసం, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం కోసం జరుగుతున్న ఈ ప్రయత్నాన్ని అధికార యంత్రాంగం రైతుల సహకారంతో విజయవంతం చేయాలని సీఎం కోరారు.