Asianet News TeluguAsianet News Telugu

ఆషామాషీగా జాతీయ పార్టీ పెట్టలేదు.. సీఎంగానే దేశమంతా తిరుగుతా, మహారాష్ట్ర నుంచే మొదలు : కేసీఆర్

సీఎంగా వుండే దేశవ్యాప్తంగా పర్యటిస్తానని చెప్పారు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్. రాజకీయ పార్టీలకు రాజకీయాలు ఒక ఆట అని.. టీఆర్ఎస్‌కు మాత్రం రాజకీయాలు ఒక టాస్క్ అని ఆయన వ్యాఖ్యానించారు. 
 

telangana cm kcr comments on national politics
Author
First Published Oct 5, 2022, 6:43 PM IST

తెలంగాణ కోసం కష్టపడినట్లే దేశం కోసం కష్టపడదామని సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మారుస్తూ కొత్త జాతీయ పార్టీని ప్రకటించిన నేపథ్యంలో కేసీఆర్ ప్రగతి భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. జాతీయ పార్టీ పెట్టాలని ఆషామాషీగా తీసుకున్న నిర్ణయం కాదన్నారు. రాష్ట్రాలు, దేశం అభివృద్ధి చెందితేనే సమగ్ర అభివృద్ధి జరుగుతుందని కేసీఆర్ ఆకాంక్షించారు. తెలంగాణకు కేంద్రం ఎలాంటి సాయం చేయలేదని.. దేశంలో ఇంకా కుల, లింగ వివక్ష కొనసాగుతోందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. దక్షిణ కొరియా, జపాన్, మలేషయా అద్భుత విజయాలు సాధించాయని కేసీఆర్ గుర్తుచేశారు. 

దళిత బంధు, రైతు బంధును చూసి ఆశ్చర్యపోతున్నారని.. రాష్ట్రంలో 17 లక్షల 50 వేల దళిత కుటుంబాలకు దళిత బంధు ఇస్తామన్నారు. జాతీయ పార్టీతో ముందడుగు వేస్తున్నామని.. దేశ ప్రజల సమస్యలే ఎజెండాగా జాతీయ పార్టీని ముందుకు తీసుకెళ్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. అఖిలేష్, తేజస్వీ యాదవ్ హైదరాబాద్‌కు వస్తామన్నారని.. తానే వద్దన్నానని కేసీఆర్ తెలిపారు. సరిగ్గా 21 ఏళ్ల క్రితం జలదృశ్యంలో మనం ప్రారంభమయ్యామని సీఎం గుర్తుచేసుకున్నారు. సమైక్య పాలనలో ఆనాడు తెలంగాణ నష్టపోయిందని.. వ్యవసాయం, సాగునీరు, విద్యుత్ అభివృద్ధి చేస్తున్నామని కేసీఆర్ తెలిపారు. 

ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయని పక్కా రాష్ట్రాలు ఆశ్చర్యపోతున్నాయని... ఒక దీక్షలా చేశాము కాబట్టే ఇది సాధ్యమైందని కేసీఆర్ పేర్కొన్నారు. దేశాన్ని ఏలిన పార్టీలు ప్రజలకు చేసింది ఏమీ లేదని సీఎం అన్నారు. రాజకీయ పార్టీలకు రాజకీయాలు ఒక ఆట అని.. టీఆర్ఎస్‌కు మాత్రం రాజకీయాలు ఒక టాస్క్ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పడినప్పుడు తలసరి ఆదాయం దాదాపు లక్ష అని.. ఇవాళ తెలంగాణ తలసరి ఆదాయం లక్షా 78 వేలని సీఎం అన్నారు. తాను సీఎంగా వుంటూనే దేశం మొత్తం పర్యటిస్తానని కేసీఆర్ పేర్కొన్నారు. మొదటి కార్యక్షేత్రంగా మహారాష్ట్రను ఎంచుకుంటున్నట్లు ఆయన తెలిపారు. మన జాతీయ పార్టీకి అనుబంధ రైతు సంఘం మహారాష్ట్ర నుంచే మొదలు కాబోతోందని సీఎం వెల్లడించారు. మనతో కలిసి వచ్చేందుకు అనేక పార్టీ నేతలు ముందుకొస్తున్నాని కేసీఆర్ పేర్కొన్నారు. 

Also Read:కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ : బెజవాడలో బీఆర్ఎస్ పేరిట హోర్డింగ్‌లు, పోస్టర్‌లు

అంతకుముందు తెలంగాణ మోడల్ దేశంలో అమలు కావాల్సిన అవసరం ఉందన్నారు సీఎం కేసీఆర్ . బుధవారం నాడు తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ విస్తృతస్థాయి  సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మారుస్తూ తీర్మానం చేశారు. ఈ తీర్మానానికి ముందుగా కేసీఆర్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రసంగించారు. జాతీయ పార్టీని ఏర్పాటు చేసేందుకు దారి తీసిన పరిస్థితులను కేసీఆర్ వివరించారు. జాతీయ రాజకీయాల్లోకి ఎందుకు వెళ్లాల్సి వస్తుందనే విషయమై కేసీఆర్ వివరించారు.

బీజేపీ అనుసరిస్తున్న విధానాల వల్ల  దేశంలో వెనుకబడిపోతుందన్నారు. బంగ్లాదేశ్ కంటే మన దేశం వెనుకబడి ఉండడం ఏమిటని కేసీఆర్ ప్రశ్నించారు. అఖిలేష్ యాదవ్ ను ఈ సమావేశానికి రావొద్దని తానే చెప్పినట్టుగా తెలిపారు. ములాయం సింగ్ యాదవ్ ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారని కేసీఆర్ వెల్లడించారు. ఈ కారణంగానే తాను అఖిలేష్ ను రావొద్దని చెప్పానని... ములాయం కోలుకున్న తర్వాత అందరం కలిసి వస్తారనే ఆకాంక్షను కేసీఆర్ వ్యక్తం చేశారు. దేశ ప్రజల కోసమే బీఆర్ఎస్ ను ఏర్పాటు చేస్తున్నట్టుగా సీఎం చెప్పారు. రైతు సంక్షమమే ఎజెండాగా ముందుకు సాగుతామని కేసీఆర్ వివరించారు. మహరాష్ట్ర నుండి పర్యటనను ప్రారంభించనున్నట్టుగా ఆయన ప్రకటించారు. కర్ణాటకలో కూడా మన జెండా ఎగురాలని కేసీఆర్ ఆకాంక్షించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios