హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్ాల నగరి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే రోజా ఆరోగ్య పరిస్థితిని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆరా తీశారు. శుక్రవారం రాత్రి కేసీఆర్ ఫోన్ చేసి రోజాను పరామర్శించారు 

రోజా నెల రోజుల క్రితం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్నారు. వైద్యుల సూచనల మేరకు ఆమె చెన్నై నగరంలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్ ఆమెకు ఫోన్ చేసి, ఆమె ఆరోగ్య స్థితిపై ఆరా తీశారు. 

త్వరగా కోలుకోవాలని కేసీఆర్ ఆశించారు కుటుంబ సభ్యుల యోగక్షేమాలను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ స్వయంగా తనకు ఫోన్ చేయడంపై రోజా ఆనందం వ్యక్తం చేశారు. 

ఈ ఏడాది మార్చి 27వ తేదీన రోజా చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు వైద్యులు ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించారు. రోజాకు రెండు శస్త్రచికిత్సలు జరిగాయి. ఏడాది క్రితమే ఆమెకు శస్త్రచికిత్సలు జరగాల్సి ఉండగా, ఎన్నికలూ కరోనా కారణంగా వాయిదా పడ్డాయి.