తెలంగాణ రాష్ట్ర సమితికి ఆదాయ వ్యయాలు, నగదు నిల్వలకు సంబంధించిన లెక్కలు వివరించారు ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్. టీఆర్ఎస్ ప్లీనరీలో ఈ మేరకు ఆయన వివరాలు తెలిపారు. మొత్తం రూ.1000 కోట్లపైనే నిధులు వున్నట్లు తెలిపారు.
టీఆర్ఎస్ (trs) ఇప్పుడు సంపన్నమైన పార్టీ అని.. నియోజకవర్గం కేంద్రాల్లోనూ పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేసే యోచన వుందని కేసీఆర్ (kcr) పేర్కొన్నారు. హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరగుతున్న టీఆర్ఎస్ ప్లీనరీలో (trs plenary) ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా టీఆర్ఎస్సే గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో 90కి పైగా స్థానాలు వస్తాయని సర్వేలు చెబుతున్నాయని కేసీఆర్ పేర్కొన్నారు. పార్టీకి రూ. 450 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు వున్నాయని.. రూ. 861 కోట్ల నిధులు వున్నాయని సీఎం తెలిపారు. ఈ నిధులు వివిధ బ్యాంకుల్లో వుంచామని... దీనికి రూ.3 కోట్ల 84 లక్షల వడ్డీ ప్రతినెలా వస్తుందని కేసీఆర్ పేర్కొన్నారు. మొత్తంగా రూ.865 కోట్ల నగదు మన పార్టీకి వుందన్నారు. అన్నీ కలిపితే వెయ్యి కోట్ల అసెట్స్‌ను టీఆర్ఎస్ కలిగి వుందని సీఎం వెల్లడించారు.
దేశ విదేశాల్లో వున్న ఆర్ధికవేత్తలతో దేశాభివృద్దిపై చర్చ పెడతామన్నారు టీఆర్ఎస్ అధినేత. హైదరాబాద్‌లో నిర్వహించే ఈ భేటీకి మేధావుల్ని కూడా ఆహ్వానిస్తామన్నారు. 75 ఏళ్ల స్వాతంత్ర్య ఫలితం ప్రజలకు అందాలని సీఎం పేర్కొన్నారు. దేశంలో నీరు వుంది.. కానీ రైతులకు నీరందదని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో కరెంట్ వుంది.. కానీ ప్రజలకు అంధకారమేనని సీఎం పేర్కొన్నారు. చైనా ఎందుకు ఆర్ధికాభివృద్ధిలో దూసుకుపోతోంది.. మనం ఎందుకు వెనుకబడ్డామని కేసీఆర్ ప్రశ్నించారు.
మూస రాజకీయాలు నడుపుతూ.. దేశాభివృద్ధికి ఆటంకాలు సృష్టిస్తున్నారని సీఎం మండిపడ్డారు. ఫ్రంటులు, టెంటుల పంథా నుంచి భారతదేశం బయటపడాలని కేసీఆర్ ఆకాంక్షించారు. మనదేశంలో టూరిజం ఎందుకు అభివృద్ధికి నోచుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. కలలు కనవచ్చు.. వాటిని సాకారం చేసుకోవచ్చని తెలంగాణ నిరూపించిందని సీఎం అన్నారు. కొత్త రాజకీయ ఎజెండా, కొత్త పంథా దేశ రాజకీయాల్లో రావాల్సి వుందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ యావత్తు భూముల ధరలు పెరిగాయని.. ముందు ముందు రాష్ట్రంలో భూముల ధరలు మరింత పెరుగుతాయని సీఎం తెలిపారు.
మనసు పెట్టి చేస్తే అమెరికాను మించిన ఆర్ధిక శక్తిగా భారత్ ఎదుగుతుందని కేసీఆర్ పేర్కొన్నారు. అన్ని వనరులు వుండి.. భారత్ ఆగమైపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మనవంతు ప్రయత్నంగా దేశానికి కొత్త ఎజెండా కోసం ఓ సైనికుడిగా ప్రయత్నిస్తానని కేసీఆర్ స్పష్టం చేశారు. రైతులకు ఇబ్బంది రాకుండా ధాన్యం సేకరణ చేయాలని సీఎం పిలుపునిచ్చారు. దేశ రాజకీయాల్లో మార్పుకి వెళ్తున్నామని.. దీవించండని పిలుపునిస్తే విరాళాలు అవే వస్తాయని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. భారతదేశానికి ప్రత్యామ్నాయ, అద్భుత రాజకీయ ఎజెండా రావాలని కేసీఆర్ ఆకాంక్షించారు.
