బీజేపీ, టీఆర్ఎస్‌లపై మండిపడ్డారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరలు పెంచి వారే రోడ్లపై ధర్నాలు చేస్తున్నారంటూ భట్టి విమర్శించారు.
యాసంగిలో వరి కొనుగోలు (paddy procurement) చేయకపోతే ప్రధాని మోడీ (narendra modi) , సీఎం కేసీఆర్‌లకు (kcr) రాజకీయంగా రైతులు ఉరి వేస్తారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (bhatti vikramarka) హెచ్చరించారు. పాదయాత్రలో (padayatra) భాగంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ.. రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్న బిజెపి (bjp) టిఆర్ఎస్ (trs) పాలకులు ఇక రాజకీయ డ్రామాలు ఆపాలని చురకలు వేశారు. రైతులకు భరోసా కల్పిస్తూ వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియకు ప్రణాళికలు సిద్ధం చేయాలని విక్రమార్క సూచించారు. రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సిన పాలకులు తమ బాధ్యతను విస్మరించడం విడ్డూరంగా ఉందంటూ దుయ్యబట్టారు. ధర్నాలు, రాస్తారోకోలు చేయాలని గ్రామాల్లోకి వచ్చే బిజెపి, టీఆర్ఎస్ నాయకులను వరి ధాన్యం కొనుగోలుపై నిలదీయాలని విక్రమార్క పిలుపునిచ్చారు.
ధరలు ఎందుకు పెంచుతున్నారో, మళ్లీ వాళ్ళే ఎందుకు ధర్నాలు చేస్తున్నారో జనాలే అడగాలని ఆయన సూచించారు. ధర్మా మీటర్ లో పాదరసం పెరిగినట్టు మోడీ సర్కార్ పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, టిఆర్ఎస్ సర్కార్ కరెంటు చార్జీల ధరలు పెంచుతున్నాయంటూ దుయ్యబట్టారు. చివరికి వాళ్ళే ధర్నాలు చేస్తూ దొంగ నాటకాలు ఆడుతున్నారంటూ సెటైర్లు వేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నవభారత నిర్మాణం చేస్తే.. కోటి ఉద్యోగాలు, ప్రతి ఒక్కరి ఖాతాలో రూ. 15 లక్షలు జమ చేస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్ (narendra modi) ఎనిమిదేళ్లుగా ఉద్యోగాల భర్తీ ఊసే ఎత్తడం లేదంటూ భట్టి విక్రమార్క చురకలు వేశారు. ప్రభుత్వ రంగ సంస్థలైన రైల్వే, ఎల్ఐసి, సింగరేణి, ఎయిర్ పోర్ట్, సీ పోర్టులను ప్రైవేటీకరణ పేరిట అంబానీ, ఆదానిలకు కట్టబెడుతున్నారని ఆయన ఆరోపించారు. సంపదను కొల్లగొట్టి దేశ భవిష్యత్తును మోడీ అంధకారంలోకి నెడుతున్నారని భట్టి ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో 1.91 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం కేవలం 80 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ వేస్తామని ప్రకటించిందంటూ దుయ్యబట్టారు. మిగతా ఖాళీలను ఎప్పుడు భర్తీ చేస్తారో వెల్లడించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నెల 9న ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్టు అసెంబ్లీలో ప్రకటన చేసి 18 రోజులు దాటుతున్నా అధికారికంగా నోటిఫికేషన్ (employment notification) విడుదల చేయకపోవడం నిరుద్యోగుల్లో అనుమానాలను రేకెత్తిస్తుందన్నారు. మరియమ్మ లాకప్ డెత్ పై జరిగిన న్యాయ పోరాటం నుంచి పుట్టిందే దళిత బంధు పథకం (dalit bandhu scheme) అని విక్రమార్క గుర్తుచేశారు.
దళిత బంధు డబ్బులు ఇప్పిస్తా నా వెంట రమ్మని కొందరు, లక్ష రూపాయలు ఇస్తే ఇప్పిస్తానని మరికొందరు ఇలా వసూలు దందా చేసే బ్రోకర్ల మాటలను నమ్మొద్దని ఆయన ప్రజలకు హితవు పలికారు. ఇలాంటి అక్రమ దందాకు పాల్పడేవారిని మహిళలు చీపిరి కట్ట తిరగేసి కొట్టాలని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు అని, ఏ ఒక్కరికి రూపాయి కూడా ఇవ్వద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తాను ప్రాతినిధ్యం వహించే మధిర నియోజకవర్గంలో బ్రోకర్లకు తావులేదని విక్రమార్క స్పష్టం చేశారు. పారదర్శకంగా ప్రతి కుటుంబానికి దళిత బంధు పథకం చింతకానిలో ఇప్పించే బాధ్యత తనదేనని పునరుద్ఘాటించారు.
రాజకీయాలకతీతంగా దళిత బంధు డబ్బులు ప్రతి దళిత కుటుంబానికి ఇవ్వాలని మంత్రి, కలెక్టర్‌కు గట్టిగా చెప్పానని విక్రమార్క పేర్కొన్నారు. లబ్ధిదారుల ఎంపిక విషయంలో అధికారులు పక్షపాత ధోరణి అవలంబిస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని భట్టి హెచ్చరించారు. సమస్యలతో సతమతమవుతూ ఇబ్బందులు పడుతున్న ప్రజల కన్నీళ్లు తుడవడానికే తాను పీపుల్స్ మార్చ్ నిర్వహిస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. తన అడుగులో అడుగు వేసి కదం తొక్కితే ప్రభుత్వాలు దిగి రాక తప్పదన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ప్రజా సమస్యలు పరిష్కారం అయ్యేవరకు తన అడుగులు ఆగవని, పాదయాత్ర ఆగదని భట్టి తేల్చిచెప్పారు.
