కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయన్నారు తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. కార్మికుల సంక్షేమం నిమిత్తం ఎన్నో చట్టాలతో పాటు పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనని విక్రమార్క గుర్తుచేశారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు తెలంగాణ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. ఆదివారం గాంధీ భవన్‌లోని ప్రకాశం హాల్‌లో అసంఘటిత కార్మిక, ఉద్యోగ కాంగ్రెస్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కార్మికుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మినిమం వేజెస్ చట్టాన్ని తెచ్చిందన్నారు. సకల జనులు సమ్మె చేసి, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ తొమ్మిదేళ్లలో ఏనాడు ఈ బోర్డుపై సమీక్ష చేయలేదని భట్టి దుయ్యబట్టారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల కోసం తీసుకొచ్చిన నిధులను ఖర్చు చేయకుండా కేసీఆర్ సర్కార్ వాటిని పక్కదారి పట్టిస్తోందని ఆయన ఆరోపించారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం నిమిత్తం ఎన్నో చట్టాలతో పాటు పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనని విక్రమార్క గుర్తుచేశారు. వీధి వ్యాపారుల సంక్షేమం కోసం కాంగ్రెస్ పాటు పడుతోందని ఆయన తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే... సంఘటిత, అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం కోసం చట్టాలు తీసుకొస్తామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. 

ALso Read: ధరణి ఓ మహమ్మారి .. బీఆర్ఎస్‌‌ను బొంద పెట్టాలనే అన్ని వర్గాల లక్ష్యం : భట్టి విక్రమార్క

వారి సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఫ్యూడలిస్ట్, కేంద్రంలో క్యాపిటలిస్టుల ప్రభుత్వం ట్రాప్‌లో కార్మికులు పడొద్దని సీఎల్పీ నేత సూచించారు. ఎనిమిది గంటల పని విధానం, మహిళలకు ప్రసూతి సెలవులు సహా ఎన్నో కార్మిక హక్కులను రాజ్యాంగంలో పొందుపరిచిన ఘనత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కే దక్కుతుందన్నారు. ఈ సమావేశంలో మధుయాష్కీ గౌడ్, మహేశ్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, ఉదిత్ రాజు, మన్సూర్ అలీఖాన్ తదితరులు పాల్గొన్నారు.