Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్‌ను అడ్డుకునేందుకు కొత్త శక్తులు.. కేసీఆర్ జాతీయ పార్టీ కూడా అలాంటిదే : భట్టి విక్రమార్క

దేశంలో లౌకికవాద పౌరులంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారని, వారిని అడ్డుకునేందుకు కొన్ని శక్తులు పుట్టుకొస్తున్నాయని, కేసీఆర్ జాతీయ పార్టీ కూడా అలాంటిదే అయ్యుండొచ్చని భట్టి విక్రమార్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే దేశంలో ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టుకోవచ్చన్నారు. 

telangana clp leader bhatti vikramarka comments on kcr's national party
Author
First Published Sep 9, 2022, 10:08 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరలో జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీల అధినేతలతో ఆయన భేటీ అయ్యారు. బీజేపీయేతర, కాంగ్రెస్‌యేతర పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావాలని భావిస్తోన్న కేసీఆర్ త్వరలో జాతీయ పార్టీ స్థాపిస్తారనే ప్రచారం జరుగుతోంది. బీజేపీని ఓడించగల సత్తా ఒక్క కేసీఆర్‌కే వుందని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ జాతీయ పార్టీపై స్పందించారు తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. శనివారం కాంగ్రెస్ సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, జైరాం రమేశ్‌లతో భేటీ అయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టుకోవచ్చని తెలిపారు. కేసీఆర్ పార్టీ వల్ల కాంగ్రెస్‌కు వచ్చిన ఇబ్బందేమీ లేదని భట్టి స్పష్టం చేశారు. 

దేశంలో లౌకికవాద పౌరులంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారని, వారిని అడ్డుకునేందుకు కొన్ని శక్తులు పుట్టుకొస్తున్నాయని, కేసీఆర్ జాతీయ పార్టీ కూడా అలాంటిదే అయ్యుండొచ్చని భట్టి విక్రమార్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఈసారి కాంగ్రెస్ పార్టీయే గెలుస్తోందని ఆయన జోస్యం చెప్పారు. మునుగోడు ఉపఎన్నికకు సంబంధించి అన్ని రకాలుగా ఆలోచించే పాల్వాయి స్రవంతిని అభ్యర్ధిగా ఎంపిక చేశామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అంబానీ, అదానీ వంటి సంపన్నులు బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.12 లక్షల కోట్ల రుణాల్ని కేంద్రం రద్దు చేసిందని.. కానీ రైతు రుణమాఫీ విషయంలో మాత్రం బీజేపీ సర్కార్ చొరవ చూపించడం లేదని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ALso REad:త్వరలోనే జాతీయ పార్టీ: హైద్రాబాద్ వేదికగానే పార్టీ పేరును ప్రకటించనున్న కేసీఆర్

ఇకపోతే.. తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరలోనే జాతీయ రాజకీయ పార్టీని ప్రకటించే అవకాశం ఉంది. ఈ మేరకు టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.ఇవాళ రాష్ట్రంలోని టీఆర్ఎస్ జిల్లా కమిటీలు తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలని తీర్మానాలు చేయనున్నాయి. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పాటు కాకుండా ఉండేందుకు కేసీఆర్ ప్రయత్నాలు ప్రారంభించారు.ఈ క్రమంలోనే  జాతీయ పార్టీ ఏర్పాటు చేయాలని ఆయన భావిస్తున్నారు. గత కొంత కాలంగా బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగానే దేశ ఆర్ధిక పరిస్థితి మరింత దిగజారిందని కేసీఆర్ ఆరోపణలు చేశారు. సమయం వచ్చినప్పుడల్లా బీజేపీపై విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు. టీఆర్ఎస్ విమర్శలను బీజేపీ నాయకత్వం తిప్పి కొడుతుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios