ఆంధ్ర ప్రదేశ్ నుండి మిగులు బడ్జెట్ తో విడిపోయిన తెలంగాణను ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుల ఊబిలోకి నెడుతున్నారని తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ఆర్థిక క్రమశిక్షణ లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు అప్పులు చేస్తోందని అన్నారు. దీనివల్ల రాష్ట్రం భవిష్యత్ ఇబ్బందులపాలు అవ్వాల్సి వస్తుందని భట్టి విక్రమార్క హెచ్చరించారు. 

ఇటీవల ఫైనాన్స్ కమీషన్ సభ్యులు తెలంగాణలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ  సందర్భంగా రాష్ట్రంలోని వివిధ సమస్యలను టిపిసిసి వారి దృష్టికి తీసుకెళ్లిందని అన్నారు. రాష్ట్ర వెనుకబాటు తనానికి కారణమయ్యే ప్రతి సమస్యను పరిష్కరించాలని కోరినట్లు తెలిపారు. ముఖ్యంగా విభజన చట్టంలోని హామీల మేరకు బయ్యారం స్టీల్ ప్లాంట్, రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి నిధులు కేటాయించాలని కోరామన్నారు.

ఇక ఆంధ్ర ప్రదేశ్ లోని పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించినట్లే తెలంగాణలోని ప్రాణహిత చేవెళ్ల (కాళేశ్వరం) కు జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని కోరినట్లు తెలిపారు. అలాగే కాంగ్రెస్ పాలనలో ప్రవేశపెట్టిన వంద రోజుల పని పథకానికి సంబంచిన నిధులు విడుదలయ్యేలా చూడాలని కోరామన్నారు. అలాగే రాష్ట్రంలోని స్థానిక సంస్థలు, విద్యా సంస్థలు , వైద్య సంస్థలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరినట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు.