బ్యాంక్ మోసం, సైబర్ మోసాలకు పాల్పడి పరారీలో ఉన్న ఇద్దరు నిందితులను తెలంగాణ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరు రెండు వేర్వేరు కేసుల్లో నిందితులుగా ఉన్నారు.
బ్యాంక్ మోసం, సైబర్ మోసాలకు పాల్పడి పరారీలో ఉన్న ఇద్దరు నిందితులను తెలంగాణ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరు రెండు వేర్వేరు కేసుల్లో నిందితులుగా ఉన్నారు. నిందితుల్లో ఒకరిని హహారాష్ట్ర నుంచి, మరొకరిని ఆంధ్రప్రదేశ్ నుంచి సీఐడీ ప్రత్యేక బృందాలు అదుపులోకి తీసుకున్నాయి. వివరాలు.. నిందితుల్లో ఒక్కరైన గరంద్కర్ పరమేశ్వర్‌ను మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా జీవాతి మండలం నుంచి పట్టుకున్నారు. అతడు గత 13 ఏళ్లుగా పరారీలో ఉన్నాడు. 2010లో అతడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌ను రూ. 19 లక్షల మేర మోసం చేశాడు. అతనిపై 2013లో జైనూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి.. ఆ తర్వాత సీఐడీకి బదిలీ చేశారు.
మరో కేసులో సీఐడీ ప్రత్యేక బృందం.. ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన కోట రాజేష్‌ను అరెస్టు చేసింది. గతేడాది నుంచి అతడు పరారీలో ఉన్నాడు. ప్రముఖ కంపెనీల నుంచి డేటాబేస్‌ను దొంగిలించి ఇతర సంస్థలకు విక్రయించే ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేశాడని రాజేష్‌పై ఆరోపణలు ఉన్నాయి. అతడిపై ఐపీసీ, ఐటీ చట్టం 2008లోని వివిధ సెక్షన్ల కింద సీఐటీ క్రైమ్ సెల్‌లో కేసు నమోదైంది.
నిందితుడు రాజేష్ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి, దానిని ఉపయోగించి ప్రముఖ కంపెనీల డేటాబేస్‌లను దొంగిలించి ఆసక్తిగల ఇతర కంపెనీలకు విక్రయిస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఇక, ఇద్దరు నిందితులను పట్టుకున్న బృందాలను క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ అడిషనల్ డీజీ మహేశ్ మురళీధర్ భగవత్ అభినందించి వారికి రివార్డులు ప్రకటించారు.
