యాదాద్రి లక్ష్మినరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం: పట్టు వస్త్రాలు సమర్పించిన రేవంత్ రెడ్డి
యాదగిరిగుట్ట యాదాద్రి లక్ష్మినరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. 11 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి.
భువనగిరి: యాదాద్రి లక్ష్మి నరసింహస్వామి ఆలయంలో తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి సోమవారం నాడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇవాళ్టి నుండి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి.స్వస్తివచనంతో యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. 11 రోజుల పాటు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవాల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు కూడ పాల్గొన్నారు.
ప్రత్యేక హెలికాప్టర్ లో యాదగిరిగుట్టకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులకు ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, కలెక్టర్, డీసీపీలు స్వాగతం పలికారు.
హెలిపాడ్ నుండి ఆలయ ప్రాంగణానికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులకు పూర్ణకుంభంతో అర్చకులు స్వాగతం పలికారు.లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రేవంత్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి అమ్మవార్లకు రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలను సమర్పించారు.ముఖ్యమంత్రి వెంట డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులున్నారు.