అక్టోబర్ 3,4,5 తేదీల్లో తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన: వికాస్ రాజ్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్నాయని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ చెప్పారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్నాయని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ చెప్పారు. తెలంగాణలో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు వెళ్లేందుకు సమయాత్తం అవుతున్నామని తెలిపారు. ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఖరారు చేస్తుందని చెప్పారు. బీఆర్‌కే భవన్‌లో వికాస్ రాజ్ మట్లాడుతూ.. అక్టోబర్ 3,4,5 తేదీల్లో కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణలో పర్యటిస్తుందని చెప్పారు. కేంద్ర ఎన్నికల బృందం రాజకీయ నాయకులతో సమావేశం అవుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజేపీ, కలెక్టర్లతో కూడా సమావేశమవుతుందని చెప్పారు.
మరోవారంలో స్పెషల్ సమ్మరి రివిజన్ ముగుస్తుందని తెలిపారు. జిల్లాలో అధికారులకు ఈవీఎంలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. జనవరి నుంచి ఇప్పటివరకు 15 లక్షల కొత్త ఓట్లు నమోదయ్యాయని చెప్పారు. 3 లక్షలకు పైగా ఓట్లు రద్దయ్యాయని.. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతుందని చెప్పారు. ఫారం 6,8లు 15 వేలకు పైగా వచ్చాయని తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో అడ్రస్ మార్పుల ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. వాటిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.