తెలంగాణ ఎన్నికల్లో చివరి అంకానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఈ నెల 7వ తేదీన జరిగిన పోలింగ్ ప్రక్రియలో వివిధ పార్టీలు, నాయకుల భవితవ్యం ఓట్ల రూపంలో ఈవీఎం మిషన్లనో నిక్షిప్తమయ్యాయి. రేపు జరగనున్న ఓట్ల లెక్కింపుతో వారి భవితవ్యం బయటపడనుంది. ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియకు జరుగుతున్న ఏర్పాట్లపై తెలంగాణ సీఈవో రజత్ కుమార్ రిటర్నింగ్, జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

ఓట్ల లెక్కింపు జరిగే కేంద్రాల్లో చేపడుతున్న ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. అలాగే ఫలితాలు వెల్లడించిన తర్వాత  ఎలాంటి  అవాంఛనీయ ఘటనలు జరక్కుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లా పోలీస్ యంత్రాంగంతో పాటు కేంద్ర బలగాలను అందుకోసం ఉపయోగించుకోవాలని సూచించారు. ఇక ఓట్ల లెక్కింపు ప్రక్రియను కూడా పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఎలాంటి అనుమానాలకు తావివ్వకుండా
వ్యవహరించాని రజత్ కుమార్ అధికారులకు ఆదేశించినట్లు సమాచారం. 

తెలంగాణ ఎన్నికల్లో పోలింగ్ శాతం గతంలో కంటే పెరగడంతో ప్రముఖ పార్టీలపై తమ గెలుపుపై ధీమా  వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ  వ్యతిరేకతతోనే ఓటింగ్  శాతం  పెరిగిందే... అది తమ గెలుపుకు తోడ్పడుతుందని కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఇక తమ అభివృద్ది, సంక్షేమ పాలనను చూసే ప్రజలు ఓటు వేయడానికి అధికంగా వచ్చారని...పెరిగిన ఓటింగ్ శాతం తమకు అనుకూలంగా ఉంటుందని టీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. ఇలా గెలుపుపై ఇరు పార్టీలు ధీమా వ్యక్తం చేస్తుండటం ఫలితాలపై మరింత ఆసక్తిని పెంచింది. 

ఇక వివిధ సంస్థల ఎగ్జిట్ ఫోల్స్ కూడా ఎన్నికల ఫలితాలపై ప్రజల్లో ఆసక్తి పెరగడానికి కారణమయ్యాయి. జాతీయ సంస్థలన్ని టీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని తేల్చగా, మాజీ ఎంపి లగడపాటి రాజగోపాల్ సర్వే మాత్రం మహాకూటమికి పట్టం కట్టింది. దీంతో ఎవరి సర్వేలు నిజమైతాయో తెలీయ ప్రజలందరు ఓట్ల లెక్కింపుపైనే దృష్టిపెట్టారు. వారి ఉత్కఠకు రేపటితో తెరపడనుంది.