తెలంగాణ కేబినెట్ భేటీ ప్రారంభం: పోతిరెడ్డిపాడు, ఆర్టీసీతో పాటు పలు కీలకాంశాలపై చర్చ
తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం సోమవారం నాడు సాయంత్రం ప్రగతి భవన్ లో ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల అమలుతో పాటు పలు కీలకమైన అంశాలపై ఈ సమావేశంలో కేబినెట్ చర్చించనుంది.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం సోమవారం నాడు సాయంత్రం ప్రగతి భవన్ లో ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల అమలుతో పాటు పలు కీలకమైన అంశాలపై ఈ సమావేశంలో కేబినెట్ చర్చించనుంది.
ఈ నెల 5వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగింది.ఈ సమావేశంలోనే లాక్‌డౌన్ ను ఈ నెల 29వ తేదీకి పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. అయితే నాలుగో విడత లాక్ డౌన్ ను ఈ నెలాఖరువరకు పొడిగిస్తూ కేంద్రం ఈ నెల 17వ తేదీన ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నాలుగో విడత మార్గదర్శకాలపై కూడ తెలంగాణ ప్రభుత్వం చర్చించనుంది. మరో వైపు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి వివాదానికి కారణమైన 203 జీవోపై కూడ కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది.
పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్ధ్యాన్ని పెంచాలని ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేయడంపై కృష్ణా రివర్ బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. మరో వైపు సుప్రీంకోర్టును కూడ ఆశ్రయిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
ఇవాళ ఉదయం నుండి మధ్యాహ్నం వరకు రాష్ట్రంలోని రైతులతో తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమగ్ర వ్యవసాయ విధానంపై చర్చించారు. ఈ విషయమై కూడ కేబినెట్ లో చర్చించారు. ప్రజా రవాణాకు కూడ అనుమతి ఇచ్చే విషయమై కూడ చర్చించనున్నారు.
also read:కరోనాతో హైద్రాబాద్‌లో బ్యాంకు ఉద్యోగి మృతి: భయాందోళనలో ఉద్యోగులు
ఆర్టీసీ ఉన్నతాధికారులతో తెలంగాణ రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశం వివరాలను కూడ కేబినెట్ కు మంత్రి అజయ్ కుమార్ నివేదించనున్నారు.
ఈ నెల 19వ తేదీ నుండి ఆర్టీసీ బస్సులను గ్రీన్, ఆరంజ్ జోన్లలో నడిపేందుకు తెలంగాణ సర్కార్ సానుకూలంగా ఉన్నట్టు సమాచారం. కేబినెట్ సమావేశం తర్వాత సీఎం ఈ విషయాన్ని ప్రకటించనున్నారు.తెలంగాణలో స్కూల్స్, కాలేజీల తిరిగి ప్రారంభించే విషయమై కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది.