Asianet News TeluguAsianet News Telugu

ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ‌కి ఆమోదం, ఆయిల్ పామ్‌కు ప్రోత్సాహాకాలు: తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే

రాష్ట్రంలో ఆయిల్ పామ్‌ పంట సాగు ప్రోత్సహించాలని తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. రానున్న 2022-23 సంవత్సరానికి 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేపట్టే దిశగా రైతులను చైతన్యపరిచి ప్రోత్సహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 
 

telangana cabinet key decisions ksp
Author
Hyderabad, First Published Jul 14, 2021, 9:19 PM IST

ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన తెలంగాణ  కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ సహా పలు కీలక నిర్ణయాలకు మంత్రి మండలి ఆమోదముద్ర వేసింది. కొత్త జోనల్ వ్యవస్థ, కొత్త జిల్లాల ప్రకారమే ఉద్యోగాల విభజన చేయాలని నిర్ణయించింది. అన్ని ఉద్యోగాల ఖాళీలను గుర్తించాలని అధికారులకు కేబినెట్ ఆదేశించింది. ప్రమోషన్ల ద్వారా ఏర్పడే ఖాళీలనూ భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఏపీలో వున్న 200-300 మంది తెలంగాణ ఉద్యోగులూ రాష్ట్రానికి వస్తారని కేబినెట్ తెలిపింది. వారిని కూడా కలుపుకుని ఖాళీలను గుర్తించాలని ఆదేశించింది. ఉద్యోగ ఖాళీలపై సబ్ కమిటీకి ఐదు రోజుల్లోగా నివేదిక అందించాలని ఆదేశించింది. 

అవసరాలను గుర్తించి అధికారులు, నిపుణులు సంయుక్తంగా రైతులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. పౌరసరఫరాల శాఖ సహా వ్యవసాయశాఖలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని కేసీఆర్ సూచించారు. పండిన ధాన్యం పండినట్లే ఫుడ్ ప్రాసెసింగ్‌లో భాగంగా మిల్లింగ్ చేసి ఎక్కడ డిమాండ్ ఉంటే అక్కడికి సరఫరా చేయాలని ఆదేశించారు. 

అవసరమైతే ఆయా రంగాల్లో నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాలని సీఎం కోరారు. కొత్తగా ముందుకొచ్చే అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తుల పరిశ్రమలను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి పెరగనున్న నేపథ్యంలో ధాన్యం నిల్వ, మిల్లింగ్, మార్కెటింగ్ సహా కొత్త పరిశ్రమల ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలపై వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. మంత్రులు గంగుల కమలాకర్, హరీశ్ రావు, కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, సబితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్ రెడ్డి, జగదీశ్ రెడ్డి ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.  

అలాగే రాష్ట్రంలో ఆయిల్ పామ్‌ పంట సాగు ప్రోత్సహించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. రానున్న 2022-23 సంవత్సరానికి 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేపట్టే దిశగా రైతులను చైతన్యపరిచి ప్రోత్సహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు ఎకరాకు.. మొదటి ఏడాది రూ.26 వేలు, తరువాతి రెండేళ్లు ఏటా రూ.5 వేల చొప్పున పంట పెట్టుబడి ప్రోత్సాహకం కింద రాయితీగా అందించాలని మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. 

దీనిలో భాగంగా అటవీ శాఖ, అటవీ అభివృద్ధి సంస్థతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు సంయుక్తంగా ఆయిల్ పామ్ మొక్కల నర్సరీలు పెంచాలని కేబినెట్ ఆదేశించింది. ఈ పంట సాగు విధానం గురించి మరింతగా తెలుసుకునేందుకు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కూడిన అధ్యయన బృందం.. కోస్టారికా, మలేసియా, థాయ్‌లాండ్, ఇండోనేషియా తదితర దేశాల్లో పర్యటించాలని మంత్రివర్గం ఆదేశించింది. టీ ఐడియా, తెలంగాణ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల నిబంధనల ప్రకారం ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ప్రోత్సాహకాలు అందించాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది.  

రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను పెద్ద ఎత్తున స్థాపించాలని రాష్ట్ర‌ కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశలో కనీసం 10 జోన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 500 ఎకరాలకు తగ్గకుండా 1000 ఎకరాల వరకు తెలంగాణ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. తద్వారా సుమారు రూ. 25 వేల కోట్ల పెట్టుబడిని ఆకర్షించి, 70 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి మ‌రో 3 లక్షల మందికి పరోక్ష ఉపాధిని కల్పించాలని నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు ప్రత్యేకంగా ‘ప్లగ్ అండ్ ప్లే’ పద్దతిలో షెడ్లను ప్రభుత్వమే నిర్మించాలని నిర్ణయించింది. 

వ్యవసాయ రంగంలో సాంకేతికతను, నైపుణ్యాన్ని పెంచే దిశగా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ విధానాన్ని అమలు పరచాలని అధికారులను అదేశించింది. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల చుట్టూ కనీసం 500 మీటర్ల వరకు బఫర్ జోన్ గా గుర్తించి ఎలాంటి జనావాసాలకు, నిర్మాణాలను అనుమతించకూడదని కేబినెట్ సూచించింది. ఆసక్తి కలిగిన వ్యాపారవేత్తలు ఎంటర్ ప్రెన్యూర్స్ దరఖాస్తు చేసుకోవడానికి ప్రస్థుతం జూలై 12 వరకు వున్న గడువును జులై 31 వరకు పొడిగించాలని మంత్రి మండలి నిర్ణయించింది. 

అలాగే తెలంగాణలో లాజిస్టిక్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు చేయాలని సూచించింది. రాష్ట్రంతో పాటు దేశ విదేశాలకు ప్రాసెస్ చేసిన ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి వీలు కల్పించే దిశగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు ప్రోత్సాహం అందించాలని నిర్ణయించింది. ఈ ప్రోత్సాహకాల్లో భాగంగా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల లో స్థాపించే యూనిట్లకు పలు విధాల రాయితీలను అందించాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందులో కరెంట్ సబ్సిడీ, రుణం, తదితర అంశాలు వున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios