హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నెల 19వ తేదీన కేబినెట్‌ను విస్తరించనున్నారు. ఈ దఫా ఎనిమిది నుండి 10 మందికి తన కేబినెట్‌లో చోటు కల్పించనున్నారు కేసీఆర్. కేటీఆర్, హరీష్‌లకు ఇస్తే ఇద్దరికీ పదవులు దక్కవచ్చు.. లేదంటే వారిద్దరిని కూడ కేబినెట్‌కు దూరంగా పెట్టే అవకాశాలు లేకపోలేదు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో  మొదటి నుండి కీలకంగా వ్యవహరించిన వారికి ఈ దఫా మంత్రివర్గంలో పెద్దపీట వేసే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. పనితీరు ఆధారంగానే కేబినెట్‌లో చోటు దక్కనుంది. 

తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికగా కేబినెట్‌లో చోటు కల్పించనున్నారు. మరో వైపు అన్ని సామాజిక వర్గాలకు కూడ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కూడ లేకపోలేదు. పామ్‌హౌజ్‌లో కేసీఆర్ రెండు మూడు రోజులుగా కేబినెట్ కూర్పుపై  కసరత్తు నిర్వహించారు.

గత మంత్రివర్గంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్‌కు  కేబినెట్‌లో బెర్త్ ఖాయమనే ప్రచారం ఉంది. ఈటలను తొలుత స్పీకర్ పదవికి ప్రతిపాదించారు. అయితే స్పీకర్ పదవిని తీసుకొనేందుకు ఈటల సుముఖంగా లేని కారణంగా ఈ పదవికి పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఎంపిక చేశారు. దీంతో ఈటల రాజేందర్ కు కేసీఆర్ కేబినెట్‌లో బెర్త్ ఖాయంగా ఉందంటున్నారు.

మరో వైపు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌ వెన్నంటి ఉన్న వారిలో  సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఒకరు. 2014లో నిరంజన్ రెడ్డి వనపర్తి నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ దఫా ఆయన విజయం సాధించారు. గత టర్మ్‌లో ఉమ్మడి మహాబూబ్ నగర్ జిల్లా నుండి లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావులకు మంత్రివర్గంలో చోటు దక్కింది.

కానీ, ఈ దఫా జూపల్లి కృష్ణారావు ఓటమి పాలయ్యారు. దీంతో నిరంజన్‌రెడ్డికి మంత్రి పదవి ఖాయంగా కన్పిస్తోంది. లక్ష్మారెడ్డికి మరోసారి అవకాశం ఇస్తారా లేదా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మరో వైపు గత టర్మ్‌లో టీడీపీ నుండి టీఆర్ఎస్ లో చేరిన ఎర్రబెల్లి దయాకర్ రావుకు కూడ మంత్రివర్గంలో ఛాన్స్ దక్కుతోందని ప్రచారం సాగింది. కానీ, ఆయనకు కేబినెట్‌లో బెర్త్ దక్కలేదు.

ఈ దఫా జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ నుండి  ఓటమి పాలు కావడంతో ఆ సామాజికవర్గం కోటా నుండి ఎర్రబెల్లి దయాకర్ రావుకు చోటు దక్కే అవకాశం ఉందంటున్నారు. కేటీఆర్, హరీష్‌లలో ఇద్దరికీ కూడ కేబినెట్‌లో చోటు కల్పించే అవకాశాలు లేకపోలేదు. తప్పిస్తే వీరిద్దరికీ కూడ మంత్రివర్గంలో చోటు దక్కకపోవచ్చు.

గత టర్మ్‌లో మిషన్ భగీరథ కార్పోరేషన్ ఛైర్మెన్‌గా ఉన్న వేముల ప్రశాంత్‌రెడ్డికి కేసీఆర్  తన మంత్రివర్గంలో చోటు కల్పించనున్నారు. మరో వైపు గత టర్మ్‌లో కొప్పుల ఈశ్వర్‌కు మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని  హామీ ఇచ్చారు. కానీ, కొన్ని కారణాలతో ఆయనను విప్ పదవికే పరిమితం చేశారు. ఈ దఫా మాత్రం కొప్పుల ఈశ్వర్‌కు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది.

గత టర్మ్‌లో కేసీఆర్ కేబినెట్‌లో మహిళలు ఎవరూ కూడ మంత్రులుగా లేరు. ఈ దఫా పద్మాదేవేందర్ రెడ్డికి  కేబినెట్‌లో చోటు దక్కే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆమెకు కాకపోతే గొంగిడి సునీతకు కేబినెట్‌లో అవకాశం కల్పించే ఛాన్స్ ఉందంటున్నారు.

ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ లో చేరిన గుత్తా సుఖేందర్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉందనే ప్రచారం లేకపోలేదు.  ఖమ్మం జిల్లా నుండి పువ్వాడ అజయ్ మాత్రమే విజయం సాధించారు.

అయితే టీడీపీ నుండి  విజయం సాధించిన సండ్ర వెంకటవీరయ్య టీడీపీ నుండి టీఆర్ఎస్‌లో చేరే అవకాశం ఉంది. దీంతో  సండ్రకు మంత్రి పదవిని ఇస్తారనే ప్రచారం కూడ ఉంది. మరో వైపు సండ్ర వెంకటవీరయ్య టీటీడీ బోర్డు మెంబర్‌గా ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది. 

అయితే సండ్ర ఇంతవరకు ఆ బాధ్యతలు తీసుకోలేదు. దీంతో  ఈ నియామాకాన్ని రద్దు చేస్తూ ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకొంది.గత టర్మ్‌లో తుమ్మల నాగేశ్వర్ రావు మంత్రిగా పనిచేశారు. ఈ దఫా తుమ్మలకు వెంటనే అవకాశం కల్పిస్తారా అనేది ఇంకా స్పష్టం కాలేదు.


అయితే సండ్ర ఇంతవరకు ఆ బాధ్యతలు తీసుకోలేదు. దీంతో  ఈ నియామాకాన్ని రద్దు చేస్తూ ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకొంది.గత టర్మ్‌లో తుమ్మల నాగేశ్వర్ రావు ఖమ్మం జిల్లా నుండి మంత్రిగా కొనసాగారు.  ఈ ఎన్నికల్లో తుమ్మల పాలేరు నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ దఫా తుమ్మలకు వెంటనే అవకాశం కల్పిస్తారా అనేది ఇంకా స్పష్టం కాలేదు.

గత టర్మ్‌లో గిరిజన శాఖ మంత్రిగా పనిచేసిన చందూలాల్  ఈ దఫా ఓటమి పాలయ్యారు. చందూలాల్‌పై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీతక్క విజయం సాధించారు. ఈ దఫా గిరిజనుల కోటాలో రెడ్యానాయక్‌లలో కేబినెట్‌లో బెర్త్ దక్కే అవకాశం ఉంది.

గత టర్మ్‌లో ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి మంత్రిగా  కొనసాగిన జగదీష్ రెడ్డికి ఈ దఫా కూడ ఛాన్స్ ఉండే అవకాశం ఉందంటున్నారు. మరో వైపు ఇదే జిల్లాకు చెందిన గుత్తా సుఖేందర్ రెడ్డి కూడ కేబినెట్‌లో చోటు కోసం పోటీ నెలకొంది. మరో వైపు ఇదే జిల్లా నుండి ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడ కేబినెట్‌లో చోటు కోసం పేరు ప్రముఖంగా విన్పిస్తోంది. 

హైద్రాబాద్ నుండి ఇప్పటికీ హోం మంత్రి మహమూద్ అలీ కేబినెట్‌లో ఉన్నారు. బీసీ సామాజిక వర్గం నుండి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు కేబినెట్‌లో చోటు దక్కే అవకాశం లేకపోలేదు. గత టర్మ్‌లో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన పద్మారావు గౌడ్‌ కేసీఆర్ మంత్రివర్గంలో కొనసాగారు. అయితే ఈ దఫా కేసీఆర్  కేబినెట్‌లో  పద్మారావు గౌడ్‌ తో పాటు శ్రీనివాస్ గౌడ్, స్వామి గౌడ్, కేపీ వివేకానంద గౌడ్ పేర్లు  కేబినెట్ బెర్త్ కోసం ప్రముఖంగా విన్పిస్తున్నాయి.

గత టర్మ్‌లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి  జోగు రామన్న, ఇంద్రకరణ్ రెడ్డిలకు మంత్రి పదవి దక్కింది. మున్నూరు కాపు సామాజిక వర్గం నుండి జోగు రామన్నకు మరోసారి అవకాశం దక్కుతోందా. లేదా వినయ్  భాస్కర్ కు అవకాశం ఇస్తారా అనే చర్చ కూడ లేకపోలేదు.

గత టర్మ్‌లో హోం మంత్రిగా పనిచేసిన నాయిని నర్సింహ్మరెడ్డికి కేబినెట్‌లో ఈ దఫా చోటు ఉంటుందా  లేదా అనేది తేలాల్సి ఉంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో  నాయిని నర్సింహ్మారెడ్డి  తన అల్లుడు శ్రీనివాస్ రెడ్డికి కూడ టిక్కెట్టు ఇవ్వాలని పట్టుబట్టాడు. కానీ ఈ స్థానంలో ముఠా గోపాల్‌కు కేసీఆర్ టిక్కెట్టు ఇచ్చిన విషయం తెలిసిందే.   ఈ దఫా కేబినెట్‌లో  పార్టీ కోసం పనిచేసేవారితో పాటు సమర్ధులైనవారికే చోటు కల్పించాలని కేసీఆర్ భావిస్తున్నట్టుగా పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది. 

మంత్రివర్గంలో ఛాన్స్ దక్కే వారి జాబితా

కేటీఆర్
హరీష్ రావు
ఈటల రాజేందర్
తలసాని శ్రీనివాస్ యాదవ్
సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
కొప్పుల ఈశ్వర్
వేముల ప్రశాంత్ రెడ్డి
ఎర్రబెల్లి దయాకర్ రావు
జోగు రామన్న
రెడ్యానాయక్
గుత్తా సుఖేందర్ రెడ్డి
జగదీష్ రెడ్డి
పద్మా దేవేందర్ రెడ్డి
పద్మారావు గౌడ్
శ్రీనివాస్ గౌడ్
కేపీ వివేకానంద గౌడ్
స్వామి గౌడ్
వినయ్ భాస్కర్
సండ్ర వెంకటవీరయ్య

 


 

సంబంధిత వార్తలు

ఎట్టకేలకు కేసీఆర్ మంత్రివర్గ విస్తరణకు ముహుర్తం ఖరారు