బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన తెలంగాణ కేబినెట్.. రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న మంత్రి హరీష్ రావు..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించి ఆమోదం తెలిపింది.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. ప్రగతిభవన్‌లో జరిగిన ఈ కేబినెట్ భేటీ దాదాపుగా 40 నిమిషాల పాటు సాగింది. ఈ భేటీలో బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించి ఆమోదం తెలిపింది. అలాగే పలు బిల్లులకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తోంది. ఇక, ఈ నెల 6వ తేదీన తెలంగాణ వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
బడ్జెట్ ప్రవేశపెట్టిన మరుసటి రోజు అంటే ఈ నెల 7న అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. ఈ నెల 8న బడ్జెట్‌పై సాధారణ చర్చ జరగనుంది. అదే రోజు ఆర్థిక మంత్రి హరీశ్ రావు సమాధానం చెప్పనున్నారు. ఫిబ్రవరి 9, 10, 11 తేదీల్లో పద్దుల పైన చర్చ జరగనుంది. ఫిబ్రవరి 12న సభలో ప్రభుత్వం ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశ పెట్టనుంది. అదే రోజు చర్చించి.. బిల్లుకు సభ ఆమోదం తెలపనుంది.
ఇక, ఫిబ్రవరి 9 నుంచి హౌస్‌లో ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపడతామని.. మిగిలిన వ్యవహారాలు ఏమైనా ఉంటే బీఏసీ నిర్ణయిస్తుందని సభా నాయకుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో ప్రవేశపెట్టిన నివేదికలో పేర్కొన్నారు. ఇక, 12వ తేదీ తర్వాత అసెంబ్లీ నిరవధిక వాయిదా పడే అవకాశం ఉంది.