Telangana: రాజధాని హైద‌రాబాద్ కోసం 340 కిలోమీటర్ల మేర రీజినల్ రింగ్ రోడ్ (ఆర్‌ఆర్‌ఆర్) పనులు జరుగుతున్నాయనీ, నగరంలోని ఉత్తర ప్రాంతంలో ఆర్‌ఆర్‌ఆర్ కోసం భూసేకరణ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని ఆర్థిక మంత్రి టి హరీశ్ రావు సోమవారం అసెంబ్లీలో తెలిపారు.  

Telangana Budget: రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమ‌వారం ప్రారంభమయ్యాయి. ఆర్థిక మంత్రి హ‌రీశ్ రావు అసెంబ్లీలో బ‌డ్జెట్ ను ప్ర‌వేశ‌పెట్టి ప్ర‌సంగించారు. ఈ క్ర‌మంలోనే తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్ కు సంబంధించిన ప‌లు కీల‌క విష‌యాల‌ను, అభివృద్ధి కార్య‌క్ర‌మాలు, చేప‌ట్టిన ప‌నుల‌ను ప్ర‌స్తావించారు. రాజధాని హైద‌రాబాద్ కోసం 340 కిలోమీటర్ల మేర రీజినల్ రింగ్ రోడ్ (ఆర్‌ఆర్‌ఆర్) పనులు జరుగుతున్నాయనీ, నగరంలోని ఉత్తర ప్రాంతంలో ఆర్‌ఆర్‌ఆర్ కోసం భూసేకరణ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని ఆర్థిక మంత్రి టి హరీశ్ రావు అసెంబ్లీలో తెలిపారు.

“హైదరాబాద్ నగరం చాలా వేగంగా విస్తరిస్తున్నందున, ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు ప్రాంతీయ రింగ్ రోడ్డు (RRR) ఉండాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ట్రాఫిక్ రద్దీని తగ్గించడమే కాకుండా, ఆర్‌ఆర్‌ఆర్ జిల్లాల నుండి హైదరాబాద్‌కు ప్రయాణించడానికి పట్టే సమయాన్ని తగ్గిస్తుంది”అని మంత్రి హ‌రీశ్ రావు చెప్పారు. ప్రతిపాదిత ప్రాంతీయ రింగ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్ నుండి 30 కి.మీ దాటి 340 కి.మీ పొడవునా నిర్మించబడుతుంద‌ని తెలిపారు. “ఈ RRR రహదారి ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధికి పూరిస్తుంది. రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగంలో భూసేకరణ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని ఆయ‌న తెలిపారు.

ఇక 2022-23 ఆర్థిక సంవ‌త్స‌రానికి గాను బ‌డ్జెట్ 2,56,958.51 కోట్ల వ్యయంగా ప్ర‌తిపాదించారు. ఇందులో రెవెన్యూ వ్యయం 1,89,274.82 కోట్లుగా, క్యాపిటల్ వ్యయం - 29,728.44 కోట్లుగా కేటాయించారు. 2022-2023 బ‌డ్జెట్ కేటాయింపులు నిశితంగా గ‌మ‌నిస్తే హైద‌రాబాద్ న‌గ‌రంపై ఎక్కువ‌గా ఫోకస్ చేసిన‌ట్టు అర్థం అవుతోంది. హైద‌రాబాద్ న‌గ‌రాన్ని గ్లోబ‌ల్ సిటీ గా ఎక్స్పోజ్ చేసేందుకు ప్ర‌య‌త్నించారు. వివిధ రంగాల్లో హైద‌రాబాద్ సాధించిన ప్ర‌గ‌తిని వివ‌రించారు. హైద‌రాబాద్ ను అన్నిరంగాల్లో తీర్చిదిద్దుతున్నామ‌ని మంత్రి తెలిపారు. 

నేడు ప్రారంభ‌మైన బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా మంత్రి హ‌రిశ్ రావు ప్ర‌సంగం గ‌మ‌నిస్తే.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత అనతికాలంలోనే దేశంలోకెల్లా అగ్రగామిగా తెలంగాణ రూపుదాల్చిందని అన్నారు. తెలంగాణ అస్తిత్వానికి నిలువెత్తు నిదర్శనం కేసీఆర్ సారథ్యంలోనే స్వరాష్ట్ర స్వప్నం సాకారమైందని తెలిపారు. సమైఖ్య రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి పౌరులుగా నానా అగచాట్లు పడుతున్న తెలంగాణ ప్రజానీకాన్ని సీఎం కేసీఆర్ మేల్కొల్పిన తీరు.. ఉద్యమాన్ని నడిపిన తీరు చారిత్రాత్మకమైందని అన్నారు. నూతనంగా ఏర్పడిన రాష్ట్రంలో ప్రతీదీ నూతనంగా నిర్వహించుకోవడంతో పాటు నిర్మించుకోవాల్సిందేనని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలు,వారి ప్రగతి కోసం పాటు పడుతూ ముందుకు సాగుతున్నామని తెలిపారు.

ఏడేండ్ల క్రితం సమైక్య పాలకుల అన్యాయాలకు వ్యతిరేకంగా ఇదే సభలో పోరాటం సాగించామని అన్నారు. కొట్లాడి.. పోరాటంలో సాధించుకున్న నేటి తెలంగాణ ప్రస్థానం.. ప్రజాస్వామ్య చరిత్రలో ఒక అద్భుతమని అన్నారు. బడ్జెట్ అంటే అంకెల సముదాయం కాదనీ, ప్రజల ఆశలు, ఆకాంక్షల వ్యక్తీకరణ అని అన్నారు. ఈ క్రమంలోనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా మనకు వివక్ష ఎదురవుతూనే ఉందని హరిష్ రావు అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలకులు వివక్షచూపితే.. స్వరాష్ట్రంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వ వైఖరి మొత్తంగా కాళ్లల కట్టె పెట్టినట్టు ఉందని అన్నారు. తెలంగాణ పురిటి దశలో ఉన్నప్పటి నుంచి కేంద్రం దాడి ప్రారంభించిందని బీజేపీపై నిప్పులు చెరిగారు.