Telangana: తెలంగాణలో గత కొంత కాలంగా దూకుడుగా ముందుకు సాగుతున్న బీజేపీకి కళ్లెం వేయాలని అధికార టీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. బీజేపీ టార్గెట్ చేస్తూ.. ఇప్పటికే టీఆర్ఎస్ అస్త్రశస్త్రాలను సిద్దం చేసిందనే విధంగా రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు.. బడ్జెట్ ప్రసంగం కొనసాగింది.
Telangana: తెలంగాణలో గత కొంత కాలంగా దూకుడుగా ముందుకు సాగుతున్న బీజేపీకి కళ్లెం వేయాలని అధికార టీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. బీజేపీ టార్గెట్ చేస్తూ.. ఇప్పటికే టీఆర్ఎస్ అస్త్రశస్త్రాలను సిద్దం చేసిందనే విధంగా రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు.. బడ్జెట్ ప్రసంగం కొనసాగింది. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో బీజేపీని ఏకిపారేయాలని టీఆర్‌ఎస్ బలంగా ఉందనే సంకేతాలు పంపారు. గత సమావేశాల్లో అధికార పార్టీ కాంగ్రెస్‌ను టార్గెట్ చేసింది. అయితే, గత నవంబర్‌లో జరిగిన హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికల ఫలితాల నుండి టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కే. చంద్రశేఖర రావు.. బీజేపీతో పాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై సర్వత్రా విమర్శలు గుప్పిస్తూ.. యుద్ధాన్ని ప్రకటించారు. బీజేపీ రాష్ట్రంలో బలపడుతున్న క్రమంలో టీఆర్ఎస్ తన ప్రత్యర్థి కాంగ్రెస్ కాదు.. బీజేపీ నే అనే విధంగా ప్రస్తుతం ముందుకు సాగుతున్న పరిస్థితులు కనిపించాయి.
నేడు ప్రారంభమైన బడ్జెట్ సమావేశాల సందర్భంగా మంత్రి హరిష్ రావు ప్రసంగం గమనిస్తే.. బీజేపీ, కేంద్ర ప్రభుత్వం టార్గెట్ గానే ముందుకు సాగిన క్రమం కనిపిస్తున్నది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత అనతికాలంలోనే దేశంలోకెల్లా అగ్రగామిగా తెలంగాణ రూపుదాల్చిందని హరిష్ రావు అన్నారు. తెలంగాణ అస్తిత్వానికి నిలువెత్తు నిదర్శనం కేసీఆర్ సారథ్యంలోనే స్వరాష్ట్ర స్వప్నం సాకారమైందని తెలిపారు. సమైఖ్య రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి పౌరులుగా నానా అగచాట్లు పడుతున్న తెలంగాణ ప్రజానీకాన్ని సీఎం కేసీఆర్ మేల్కొల్పిన తీరు.. ఉద్యమాన్ని నడిపిన తీరు చారిత్రాత్మకమైందని అన్నారు. నూతనంగా ఏర్పడిన రాష్ట్రంలో ప్రతీదీ నూతనంగా నిర్వహించుకోవడంతో పాటు నిర్మించుకోవాల్సిందేనని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలు,వారి ప్రగతి కోసం పాటు పడుతూ ముందుకు సాగుతున్నామని తెలిపారు.
ఏడేండ్ల క్రితం సమైక్య పాలకుల అన్యాయాలకు వ్యతిరేకంగా ఇదే సభలో పోరాటం సాగించామని అన్నారు. కొట్లాడి.. పోరాటంలో సాధించుకున్న నేటి తెలంగాణ ప్రస్థానం.. ప్రజాస్వామ్య చరిత్రలో ఒక అద్భుతమని అన్నారు. బడ్జెట్ అంటే అంకెల సముదాయం కాదనీ, ప్రజల ఆశలు, ఆకాంక్షల వ్యక్తీకరణ అని అన్నారు. ఈ క్రమంలోనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా మనకు వివక్ష ఎదురవుతూనే ఉందని హరిష్ రావు అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలకులు వివక్షచూపితే.. స్వరాష్ట్రంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వ వైఖరి మొత్తంగా కాళ్లల కట్టె పెట్టినట్టు ఉందని అన్నారు. తెలంగాణ పురిటి దశలో ఉన్నప్పటి నుంచి కేంద్రం దాడి ప్రారంభించిందని బీజేపీపై నిప్పులు చెరిగారు.
రాష్ట్ర ఆవిర్భవ వేడుకలు జరగకముందే ఖమ్మంలోని ఏడు జిల్లాలను ఏపీకి కట్టబెట్టిందని విమర్శించారు. కేంద్రం తీరుతో లోయర్ సీలేరు ప్రాజెక్టును కోల్పోయిందని అన్నారు. తెలంగాణపై తన అక్కసును కక్కిన బీజేపీ కేంద్ర ప్రభుత్వం.. తెలంగణ అవిర్భవ చర్చ జరిగిన ప్రతిసారి.. తల్లిని చంపి బిడ్డను బతికించారు అని పదేపదే బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తూ.. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతిస్తున్నారని అన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసిన చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదని అన్నారు. గిరిజన యూనివర్సీటికి కంటి తుడుపుగానే నిధులు విదిల్చిందన్నారు. రైతుల మీద భారం చేసేందుకు ఇప్పుడు మీటర్లు బిగించాలనే కుట్రతో కేంద్ర ముందుుకు సాగుతున్నదని ఆరోపించారు. ఇలా మొత్తంగా మంత్రి హరిష్ రావు బడ్జెట్ ప్రసంగం కేంద్రంలోని బీజేపీ ఎండగడుతూ ముందుకు సాగింది. ఇక ముందు కూడా బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేసే విధంగా టీఆర్ఎస్ అస్త్రశస్త్రాలను సిద్దం చేసిందనే సంకేతాలు అందించింది.
