హైదరాబాద్: తాను శాసనసభలో సోమవారం ప్రతిపాదించిన బడ్జెట్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై తుపాకి ఎక్కుపెట్టారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితికి కేంద్రమే కారణమని చెప్పడానికి ఆయన తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పే ప్రయత్నం చేశారు. 2019-2020 బడ్జెట్ ను కేసీఆర్ సోమవారం శాసనసభలో ప్రతిపాదించారు.

దేశ ఆర్థిక పరిస్థితి బాగా లేదనే విషయాన్ని కేసీఆర్ చెప్పారు. దేశంలో నెలకొన్న ఆర్థిక మాంద్యం ప్రభావం రాష్ట్రంపై పడిందని ఆయన అన్నారు. తద్వారా ఆయన కేంద్రాన్ని లక్ష్యం చేసుకుని బడ్జెట్ ప్రసంగంలో వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తోంది. డాలరుతో పోలిస్తే రూపాయి విలువ పడిపోతోందని, రూపాయి విలువ 72.43 రూపాయలకు పడిపోయిందని ఆయన చెప్పారు. ఏడాదిన్నరగా దేశంలో ఆర్థిక మాంద్యం అనే ఉప శీర్షిక పెట్టి ప్రత్యేకంగా ఆ విషయాన్ని ప్రస్తావించారు. 

ఆటో మొబైల్ రంగంలో నెలకొన్న సంక్షోభాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆటో మొబైల్ రంగంలోనే కాకుండా అన్ని రంగాలపైనా ఆర్థిక మాంద్యం ప్రభావం కనిపిస్తోందని ఆయన చెప్పారు.  2018 - 19 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశం జీడీపి 8 శాతంగా నమోదైందని, అప్పటి నుంచి క్రమంగా తగ్గుతూ వస్తోందని, రెండో త్రైమాసికంలో 7 శాతానికి, మూడో త్రైమాసికంలో 6.6 శాతానికి, చివరి త్రైమాసికంలో 5.8 శాతానికి జీడీపి వృద్ధి రేటు పడిపోయిందని ఆయన వివరించారు. 

ఆ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో మరింత దిగజారి 5 శాతం కనిష్ట వృద్ధిని నమోదు చేయడం స్థిరంగా దిగజారుతున్న ఆర్థిక పరిస్థితులకు సంకేతంగా నిలుస్తుందని ఆయన అన్నారు. ఇప్పుడు తాను చెప్పిన ఈ గణాంకాలన్నీ కేంద్రం ప్రభుత్వం సాధికారికంగా వెలువరించిన వివరాలేనని ఆయన చెప్పారు. ఆ రకంగా ఆయన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అందుకు మినహాయింపు కాదనే విషయాన్ని చెప్పకనే చెప్పారు. 

ఆటో మొబైల్ రంగంలో నెలకొన్న సంక్షోభాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటో మొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) ఇటీవల వెల్లవడించిన లెక్కలను ఆయన ఇక్కడ ప్రస్తావించారు. ఆ లెక్కలను తెలియజేస్తూ, వాహనాలు కొనే దిక్కు లేకపోవడంతో  ప్రముఖ కంపెనీలు తమ వాహనాల ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపేయాల్సిన దుస్థితి నెలకొందని ఆయన చెప్పారు. దానివల్ల మూడు రకాల నష్టం వాటిల్లిందని చెప్పారు. 

వాహనాల అమ్మకం ద్వారా వచ్చే పన్నులు ఆగిపోయాయని చెబుతూ పెట్రోల్, డీజిల్, టైర్లు, ఇతర విడిభాగాల అమ్మకాలు పడిపోయి వ్యాట్ తగ్గిపోయిందని అన్నారు. లక్షలాది మంది ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కోల్పోయారని చెప్పారు ఆటో మొబైల్ రంగంలో ఇటీవలి కాలంలో మూడున్నర లక్షల ఉద్యోగాలు తగ్గిపోవడం ఈ విషమ పరిస్థికి అద్దం పడుతోందని న్నారు. విమాన యాన రంగంలో ఏర్పడిన సంక్షోభాన్ని కూడా కేసీఆర్ తన ప్రసంగంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. 

దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం ప్రభావం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా గణనీయంగా పడిందని కేసీఆర్ చెప్పారు. జిఎస్టీని అమలు చేసిన తొలి ఏడాదిలో లెక్కలు తేలకపోవడంతో అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్లే తెలంగాణ రాష్ట్రానికి పరిహారం అందించారని చెప్పారు. ఆ తర్వాత మళ్లీ జిఎస్టీ నష్ట పరిహారం తీసుకోవాల్సిన అవసరం తెలంగాణకు రాలేదని చెప్పారు. 

అయితే, ఇటీవల ఏర్పడిన ఆర్థిక మాంద్యం కారణంగా ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో 175 కోట్ల రూపాయలు, జూన్, జులై నెలల్లో 700 కోట్ల రూపాయలు జిఎస్టీ పరిహారంగా తీసుకోవాల్సి వచ్చిందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏప్రిల్, మే నెలల్లో తీసుకున్న పరిహారం కన్ా జూన్, జులైల్లో తీసుకు్న పరిహారం నాలుగింతలు పెరగడం దిగజారిన ఆర్థిక పరిస్థితికి నిలువెత్తు నిదర్శనమని అన్నారు. తద్వారా దేశంలో ఆర్థిక మాంద్యమే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి కారణమని ఆయన చెప్పారు. 

ఆ విషయాల్లో రాష్ట్రాలు ఏమీ చేయలేవని స్పష్టంగా చెబుతూ కేంద్రం వైపు వేలెత్తి చూపారు. దేశంలో స్థూల ఆర్థిక విధానాలను శాసించేది కేంద్ర ప్రభుత్వమేనని, కేంద్రం తీసుకువచ్చిన విధానాన్నే రాష్ట్రాలు అనుసరించాలి తప్ప మరో గత్యంతరం లేదని, దీనికి తెలంగాణ రాష్ట్రం అతీతం కాదని అంటూ కేంద్రంపై పరోక్ష విమర్శలు చేశారు. దేశ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలు సంక్లిష్టతకు గురవుతున్న సమయంలో 2019-20 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి వచ్చినందుకు చింతిస్తున్నానని కూడా కేసీఆర్ అన్నారు. 

తెలంగాణ రాష్ట్రంలో వివిధ రంగాల్లో వృద్ధి రేటు సాధించలేకపోయిన వైనాన్ని వివరిస్తూ దీనికంతటికీ దేశ ఆర్థిక మాంద్యమే కారణమని అన్నారు. పన్నుల ద్వారా వచ్చే ఆదాయం మాత్రమే కాకుండా పన్నేతర ఆదాయం రాష్ట్రంలో తగ్గిన విషయాన్ని ఆయన లెక్కలతో సహా వివరించారు. 

రాష్ట్రానికి సొంత ఆదాయంలో వచ్చిన తగ్గుదలతో పాటు పన్నుల్లో వాటా చెల్లించే విషయంలో నిధుల బదలాయింపులో కూడా కేంద్ర ప్రభుత్వం కోత పెట్టిందని కేసీఆర్ గుర్తు చేశారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి పన్నుల్లో వాటా కింద తెలంగాణకు రావాల్సిన నిధుల్లో కేంద్రం 4.19 శాతం కోత పెట్టిందని, మిగతా అన్ని విషయాల్లో కూడా ఇలాగే కోత విధించడం ద్వారా మన రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లిందని ఆయన నేరుగానే కేంద్రాన్ని వేలెత్తి చూపించారు. 

అయినప్పటికీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఇతర రాష్టాల్లో పోలిస్తే కొంతలో కొంత నయమని అన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చి చూసినప్పుడు తెలంగాణ పరిస్థితి గుడ్డిలో మెల్ల అన్నట్లు కొంతలో కొంత నయంగా కనిపిస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న వివిధ రకాల పన్నుల ద్వారా మన రాష్ట్రం నుంచి గత ఐదేళ్లలో కేంద్రానికి అందిన మొత్తం నిధులు కేంద్ర ప్రభుత్వం ధ్రువీకరించిన గణాంకాల ప్రకారమే రూ. 2 లక్షల 72 వేల 926 కోట్లు కాగా, ఆ నిధుల్లో అన్ని రాష్ట్రాలకు వచ్చిన విధంగానే కేంద్ర పథకాల అమలు కోసం మన రాష్ట్రానికి 31,802 కోట్ల రూపాయలు వచ్చాయని చెప్పారు. అంటే కేంద్రానికి రాష్ట్రం నుంచి అధికంగా నిధులు వెళ్తున్నా, రాష్ట్రానికి తక్కువ వస్తోందనే విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పారు.