Asianet News TeluguAsianet News Telugu

ఆ నిర్ణయంతో కెసిఆర్ కు కొత్త చిక్కులు

తెలంగాణ సిఎం కెసిఆర్ ఆలోచించి తీసుకుంటారా? లేక ఎవరైనా బ్రీఫ్ చేయగానే ఓకె అనేస్తారో తెలియదు కానీ కొన్ని నిర్ణయాలు ఆయనకు సరికొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. తాజాగా ఆయన తీసుకున్న ఒక నిర్ణయం ఆ తరహా కొత్త సమస్యలను సృష్టించే ప్రమాదముందని పార్టీలో చర్చ జరుగుతోంది.

 

 

Telangana brahmins to get bonafide caste certificates

సిఎం కెసిఆర్ ఇటీవల తీసుకున్న ఒక నిర్ణయం కారణంగా కొన్ని వర్గాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోని బ్రాహ్మణులకు కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయాలన్నది కెసిఆర్ సర్కారు తాజాగా తీసుకున్న నిర్ణయం. ఈ క్యాస్ట్ సర్టిఫికెట్ల ద్వారా సంక్షేమ పథకాలకు ఆయా బ్రాహ్మణులు దరఖాస్తు చేసుకునేందుకు సర్కారు వెసులుబాటు కల్పించనుంది. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఏర్పాటు చేసి 200 కోట్ల రూపాయల నిధిని కూడా కేటాయించింది. బ్రాహ్మణులు సంక్షేమ పథకాల కోసం ఈ పరిషత్ ద్వారానే దరఖాస్తులను తీసుకోనుంది.

 

రాష్ట్రంలో 10 లక్షల మంది దాకా బ్రాహ్మణులున్నారని సర్కారు అంచనా వేస్తోంది. వీరందరి మద్దతు గుండుగుత్తగా సంపాదించే ఉద్దేశంతోనే ఈ తరహా ప్రయోగాలు చేపడుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఇక ఈ నిర్ణయం కారణంగా అగ్రకులాల్లోని మిగతా కులాల వారు సర్కారు నిర్ణయం పట్ల గుర్రుగా ఉన్నారు. తెలంగాణలో బ్రాహ్మణులు, రెడ్డీ (కాపు)లు, కమ్మలు, వెలమలు అగ్ర కులాల జాబితాలో ఉన్నారు. వీరిలో కేవలం బ్రాహ్మణులకే కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయడమేంటని మిగతా అగ్ర కులాల వారు ప్రశ్నిస్తున్నారు.

 

ఇప్పటి వరకు లేని కొత్త పంచాయితి ఎందుకు పెట్టినట్లు అని ఆయా వర్గాల వారు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ పేద బ్రాహ్మణులకు కుల సర్టిఫికెట్లు ఇవ్వాలనుకుంటే ఓసి అని ఇస్తే సరిపోతుంది కదా అని వారు అంటున్నారు. బ్రాహ్మణులతోపాటు మిగతా కులాలైన వెలమ, కమ్మ, రెడ్డి లలో ఉన్న పేదలకు కూడా వారితోపాటుగా ఓసి అని సర్టిఫికెట్ ఇస్తే వారందరికీ సర్కారు ఇచ్చే ప్రయోజనాలు అందుతాయి కదా అని వారు సూచిస్తున్నారు.

 

కేవలం బ్రాహ్మణులకు మాత్రమే కుల సర్టిఫికెట్లు ఇవ్వాలనుకోవడం సరికాదంటున్నారు మిగతా అగ్ర కులాల వారు. ముందునుంచీ కెసిఆర్ కు బ్రాహ్మణులపై అంతులేని అభిమానం చూపుతున్నారని వారు ఎద్దేవా చేస్తున్నారు. బ్రాహ్మణ కులానికి చెందిన వారికి పాదాభివందనాలు చేయడాన్ని ఈ సందర్భంగా వారు ఉదహరిస్తున్నారు. రాష్ట్రపతి, గవర్నర్  లకు పాదాభివందనాలు చేయడం వల్ల బ్రాహ్మణులపై ఉన్న భక్తి భావనను చాటుకుంటున్నట్లు చెబుతున్నారు.

 

మొత్తానికి బ్రాహ్మణులకు కుల సర్టిఫికెట్ల వ్యవహారం టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు కల్పిస్తుందన్న వాదన బలంగా వినిపిస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios