Asianet News TeluguAsianet News Telugu

24 గంటల విద్యుత్.. మోడీ ఘనత, కేసీఆర్ కష్టం కాదు: లక్ష్మణ్

తెలంగాణలో విద్యుత్ రంగంలో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన...ప్రధాని నరేంద్రమోడీ తీసుకుంటున్న చర్యల కారణంగా దేశంలోని 28 రాష్ట్రాల్లో మిగులు విద్యుత్ సాధ్యమైందని ఆయన ప్రశంసించారు

telangana bjp president lakshman makes comments on cm kcr
Author
Hyderabad, First Published Aug 22, 2019, 5:41 PM IST

తెలంగాణలో విద్యుత్ రంగంలో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన...ప్రధాని నరేంద్రమోడీ తీసుకుంటున్న చర్యల కారణంగా దేశంలోని 28 రాష్ట్రాల్లో మిగులు విద్యుత్ సాధ్యమైందని ఆయన ప్రశంసించారు.

కానీ తెలంగాణలో ఎలాంటి మౌలిక వసతులు కల్పించకుండా సోలార్ విద్యుదుత్పత్తిని కేసీఆర్ సర్కార్ గాలికొదిలేసిందని లక్ష్మణ్ మండిపడ్డారు. 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రధాని  మోడీ.. దక్షిణ, ఉత్తర గ్రిడ్‌లను అనుసంధానం చేయడం వల్లే ఈ రోజు రాష్ట్రంలో తక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేసేందుకు అవకాశం ఏర్పడిందని ఆయన గుర్తు చేశారు.

అయితే ఇదంతా కేసీఆర్ తన ఘనతగా చెప్పుకోవడం సరికాదని లక్ష్మణ్ వివరించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఏ పార్టీ చేయని విధంగా మారుమూల గ్రామాలకు సైతం విద్యుత్  వెలుగులు అందించిన ఘనత నరేంద్రమోడీకే దక్కుతుందన్నారు.

కేసీఆర్ ఐదేళ్ల పాలనలో విద్యుత్ రంగానికి సంబంధించి ఒక్క కొత్త ప్రాజెక్ట్ కూడా చేపట్టలేదని... ఒక్క మెగావాట్ కూడా అదనంగా విద్యుత్ ఉత్పత్తి చేయలేదని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు.

ఈ రోజు తెలంగాణలో 24 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ అందించగలుగుతున్నామంటే అది కేవలం మోడీ సంస్కరణల వల్లేనన్నారు.

జాతీయ సోలార్ విద్యుత్ విధానంలో చౌకగా రూ.4.30 పైసలకు సోలార్ విద్యుత్ ఇస్తానంటే రాత్రికి రాత్రే రూ.5.50 పైసలకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని లక్ష్మణ్ దుయ్యబట్టారు. విద్యుత్ కుంభకోణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios