టీఆర్ఎస్ నేతలు 77 మందిపై భూ కబ్జా ఆరోపణలు వున్నాయని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు. వీరిలో ఎమ్మెల్యేలు, మంత్రులు వున్నారని, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఆస్తులపైనా విచారణ జరిపించాలని సంజయ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పరిస్ధితి గంభీరంగా వుందన్నారు . శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన... కరోనాకు కేంద్రం ఇచ్చిన నిధులు పక్కదాడి పట్టించారని సంజయ్ ఆరోపించారు.

రాష్ట్ర ప్రజల ఇబ్బందులపై మీడియాలో కథనాలు వస్తున్నాయని.. కానీ సీఎం కేసీఆర్ నేటి వరకు ఒక్క సమీక్ష కూడా చేయలేదని ఆయన ఎద్దేవా చేశారు.  తెలంగాణలో కోవిడ్ మరణాలు సంఖ్యను రోజువారీ బులెటిన్ రూపంలో ప్రకటించాలని సంజయ్ కోరారు. మరణాలను వెల్లడించకుండా జిల్లా కలెక్టర్లపై ఒత్తిడి తీసుకొస్తున్నారని.. కలెక్టర్లు ఇచ్చే నివేదికకు పూర్తిగా తేడా వుంటోందని ఆయన ఆరోపించారు.

ఈ విషయానికి సంబంధించి తాము ఎన్నోసార్లు ఆధారాలతో సహా నిరూపించామని సంజయ్ గుర్తుచేశారు. సీఎం వ్యాక్సిన్ తీసుకోలేదని, ఎవరినీ తీసుకోమని చెప్పలేదని ఆయన ఎద్దేవా చేశారు. వాస్తవ విషయాలు చెబితే ప్రజల్లో నిర్లక్ష్యం వుండదని సంజయ్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు వీటిపై స్పందించని ముఖ్యమంత్రి .. వైద్య ఆరోగ్య శాఖను సంకలో పెట్టుకుంటే ప్రజల్ని ఎలా కాపాడతారని ఆయన ప్రశ్నించారు.

Also Read:'భూమి బద్దలు': పేలిన ఈటెల రాజేందర్ వ్యూహం, చిక్కుల్లో కేసీఆర్

ఏ శాఖలో డబ్బులుంటే ఆ శాఖ తీసుకుంటారని.. ఆయుష్మాన్ భారత్ అమలు చేయమంటే ఆరోగ్యశ్రీ ఉందని సంజయ్ వివరించారు. పేదలు కార్పోరేట్ ఆసుపత్రులంటేనే గుండె ఆగి చనిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా నుంచి ప్రజల దృష్టి మళ్లీంచేందుకే ఈ డ్రామా మొదలుపెట్టారని సంజయ్ ఆరోపించారు. ఒక మంత్రిపై చర్య తీసుకుంటే ప్రభుత్వమంతా నీతివంతం అయిపోదని ఆయన సెటైర్లు వేశారు.

ఎమ్మెల్యేలు, మంత్రుల కబ్జాలను మేమే బయటపెట్టామన్న సంజయ్... ముఖ్యమంత్రి దీనిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కబ్జాలు చేసిన మిగిలిన మంత్రులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు. అమీన్‌పూర్ భూముల స్కాం, డ్రగ్స్ కేసు నివేదిక ఏమైందని ఆయన నిలదీశారు. మంత్రి మల్లారెడ్డి అవినీతిపై కోర్టు ఆదేశించినా.. ఎందుకు కేసు పెట్టలేదని సంజయ్ ప్రశ్నించారు.

మల్లారెడ్డి ఇటీవల డైరెక్ట్‌గా వాటా అడిగారని బండి సంజయ్ గుర్తుచేశారు. ఈటలపై నిన్ననే ఎందుకు చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందపైనా ఆరోపణలు వచ్చాయని.. రాష్ట్రంలో అవినీతి రెండు రకాలుగా వుందని సంజయ్ ఆరోపించారు. అనుకూల అవినీతి ఒకటి వ్యతిరేకమైన అవినీతి మరొకటి అంటూ ఎద్దేవా చేశారు.

మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావుపై ఓ మహిళ హెచ్ఆర్‌సీలో ఫిర్యాదు చేసిందని బండి సంజయ్ గుర్తుచేశారు. నిజాయితీ ఉంటే ఆరోపణలు వచ్చిన అందరిపైనా విచారణ జరపాలని కోరారు. ఎమ్మెల్యే సైదిరెడ్డి కబ్జాలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని బండి సంజయ్ నిలదీశారు. ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కలెక్టరేట్ ముందు కబ్జా చేసి ఫాంహౌస్ కట్టారని ఆరోపించారు.

Also Read:కేసీఆర్ వ్యూహానికి ఈటెల రాజేందర్ కౌంటర్ వ్యూహం ఇదీ...

నిషేధిత స్థలంలో అధికారుల్ని బెదిరించి.. శ్రీనివాస్ గౌడ్ ఇల్లు కట్టారని సంజయ్ తెలిపారు. ఆలేరు ఎమ్మెల్యే సునీత, ఆమె భర్త కలిసి దేవాదాయ భూములు ఆక్రమించి వాటిలో వెంచర్లు కూడా వేశారని ఆయన వెల్లడించారు. ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పైనా కబ్జాల ఆరోపణలు వున్నాయని బండి సంజయ్ చెప్పారు.  

వీటన్నింటికీ చివరికి బలయ్యేది అధికారులేనని... ఆరోపణలు వచ్చిన నేతలందరిపైనా సీఎం ఎందుకు విచారణ జరిపించలేదని సంజయ్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వెంటనే దీనిపై స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంద్రకరణ్ రెడ్డి, ముత్తిరెడ్డిపైనా ఆరోపణలు వాస్తవం కాదా అని బండి సంజయ్ ప్రశ్నించారు.