హైదరాబాద్: మంత్రి ఈటెల రాజేందర్ మీద చర్యలు తీసుకోవడం ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తేనెతుట్టెను కదిపినట్లే ఉన్నారు. ఈటెల రాజేందర్ వ్యవహారం కేసీఆర్ కు ఎదురు తిరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. తనపై విచారణను ఆహ్వానిస్తూనే, మిగతావారి సంగతేమిటని శుక్రవారం రాత్రి ఈటెల రాజేందర్ వేసిన ప్రశ్న కేసీఆర్ మీద ప్రతిపక్షాలకు అస్త్రంగా అంది వచ్చింది. 

ఈటెల రాజేందర్ భూకబ్జా ఆరోపణల వ్యవహారాన్ని ప్రతిపక్షాలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయి. మంత్రులపై, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఇంత ముందు వచ్చిన భూకబ్జా ఆరోపణలను తిరగదోడుతున్నాయి. ముఖ్యంగా మంత్రి మల్లారెడ్డి, ముత్తిరెడ్డి వ్యవహారాలను వాడుకుంటూ కాంగ్రెసు నేతలతో పాటు బిజెపి నేతలు కేసీఆర్ మీద విమర్శల వర్షం కురిపిస్తున్నారు. 

Also Read: ఈటల భూకబ్జా ఆరోపణలు: సాయంత్రానికల్లా ప్రభుత్వానికి నివేదిక

మల్లారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి వంటి మంత్రులు, ఎమ్మెల్యేలపై వచ్చిన ఆరోపణలను బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మీడియా సమావేశంలో వరుసగా ప్రస్తావించారు. వారిపై వచ్చిన ఆరోపణలను ప్రస్తావిస్తూ వారు ఏయే భూములను కబ్జా చేశారనే ఆరోపణలు వచ్చాయనే వివరాలను, ఆ భూముల సర్వే నెంబర్లను వివరించారు. 

టీఆర్ఎస్ లో ఈటెల రాజేందర్ వ్యవహారంతో భూమి బద్దలైనట్లే కనిపిస్తోంది. కాంగ్రెసు నేతలు జీవన్ రెడ్డి, వి. హనుమంతరావు వంటి నేతలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై, మంత్రులపై వచ్చిన భూకబ్జా ఆరోపణలను ప్రస్తావించారు.. అంతేకాకుండా వివిధ సందర్భాల్లో తెర మీదికి వచ్చిన అమీన్ పూర్ భూముల వ్యవహారాన్ని, నయీమ్ కబ్జా భూముల వ్యవహారాన్ని ముందుకు తెచ్చారు. 

Also Read: కేసీఆర్ వ్యూహానికి ఈటెల రాజేందర్ కౌంటర్ వ్యూహం ఇదీ...

ఎమ్మెల్య పేర్లను, మంత్రుల పేర్లను పేరుపేరునా బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ప్రస్తావిస్తూ వారు ఎదుర్కున్న, ఎదుర్కుంటున్న ఆరోపణలను ఆయన వివరించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులపై వచ్చిన ఆరోపణలను కూడా ప్రతిపక్షాల నేతలు ప్రస్తావిస్తున్నారు.

మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మొత్తం 77 మందిపై భూకబ్జా ఆరోపణలు ఉన్నాయని పండి సంజయ్ అన్నారు. కలెక్టర్ గా ధర్మారెడ్డి, జాయింట్ కలెక్టర్ గా నగేష్ పదవుల్లో ఉన్నప్పుడు అసైన్డ్ భూములను రిజిస్ట్రేషన్ చేసినట్లు ఆరోపణలున్నాయని ఆయన చెప్పారు. వీరిద్దరే ఈటెల రాజేందర్ కు వ్యతిరేకంగా భూకబ్జా ఆరోపణలు చేశారు.