హైదరాబాద్: తెలంగాణలోనూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ బిజెపితో కలిసి చురుగ్గా పనిచేసే అవకాశం ఉన్నట్లు అర్థమవుతోంది. పవన్ కల్యాణ్ తో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ సోమవారం భేటీ అయ్యారు. 

హైదరాబాదులోని జుబ్లీహిల్స్ లో గల పవన్ కల్యాణ్ వ్యక్తిగత కార్యాలయంలో ఇరువురు నేతలు సమావేశమయ్యారు. దాదాపు గంట పాటు వీరి సమావేశం కొనసాగింది. 

బండి సంజయ్ తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా ఎంపికైన తర్వాత పవన్ కల్యాణ్ ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపితో కలిసి పనిచేస్తున్న జనసేన తెలంగాణలో కూడా కలిసి పనిచేయాలని భావిస్తున్నట్లు సమాచారం. 

ఆ కారణంగా పవన్, బండి సంజయ్ మధ్య భేటీకి ప్రాధాన్యం చేకూరింది. ఇది మర్యాదపూర్వకమైన భేటీ మాత్రమేనని బిజెపి వర్గాలంటున్నాయి.

పోతిరెడ్డిపాడు వివాదంపై పవన్ తో చర్చించినట్లు బండి సంజయ్ చెప్పారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు ప్రజల మధ్య విద్వేషాలు రగించడానికి చూస్తున్నారని ఆయన అన్నారు .