తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై విమర్శలు గుప్పించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. తెలంగాణను కులాలు, మతాలు, వర్గాల పేరుతో కేసీఆర్ విచ్ఛిన్నం చేశారని ఆయన ఆరోపించారు. ఎన్నికల హామీలను కేసీఆర్ తుంగలో తొక్కారని బండి సంజయ్ మండిపడ్డారు.  

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై మండిపడ్డారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (bandi sanjay). శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కేసీఆర్ టైంపాస్ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టుకోవచ్చని సంజయ్ అన్నారు. ముందు తెలంగాణకు ఏం చేశారో కేసీఆర్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మోడీ ఎనిమిదేళ్ల పాలనపై, కేసీఆర్ ఎనిమిదేళ్ల పాలనపై చర్చకు సిద్ధమని సంజయ్ సవాల్ విసిరారు. కుటుంబ , అవినీతి పార్టీలు దేశంలో అంతమైపోతున్నాయంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను కులాలు, మతాలు, వర్గాల పేరుతో కేసీఆర్ విచ్ఛిన్నం చేశారని సంజయ్ ఆరోపించారు. ప్రపంచంలో భారత్‌ను మోడీ అగ్రస్థానంలో నిలిపారని.. ఎన్నికల హామీలను కేసీఆర్ తుంగలో తొక్కారని ఆయన మండిపడ్డారు. 

Also Read:జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్.. ఆయనవన్నీ పగటి కలలే : బీజేపీ నేత తరుణ్ చుగ్

అంతకుముందు బీజేపీ (bjp) తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్ (tarun chugh) శనివారం మీడియాతో మాట్లాడుతూ.. జాతీయ పార్టీ ఏర్పాటుపై కేసీఆర్ (kcr) పగటి కలలు కంటున్నాడని ఎద్దేవా చేశారు. తెలంగాణలో మహిళలపై ఘోరమైన అత్యాచారాలు జరుగుతున్నాయని.. ముందు వాటిని అరికట్టడంపై కేసీఆర్ దృష్టి పెట్టాలని తరుణ్ చుగ్ హితవు పలికారు. ప్రభుత్వ వాహనాలలో రేప్ జరిగిందని.. ముఖ్యమంత్రి వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 

రేప్ కేసును పక్కదారి పట్టించేందుకు అన్ని ప్రయత్నాలు చేశారని... రక్షక భటులే భక్షక భటులుగా మారారని తరుణ్ చుగ్ మండిపడ్డారు. వెయ్యి ఎలుకలను తిన్న పిల్లి పుణ్యం కోసం కాశీకి వెళ్లినట్టుగా కేసీఆర్‌ తీరు ఉందంటూ ఆయన సెటైర్లు వేశారు. దేశంలో వేలాది పార్టీలు ఉన్నాయని.. ఆయనకు కూడా జాతీయ పార్టీ రిజిస్ట్రేషన్ చేసుకునే హక్కు ఉందన్నారు. బంగారు తెలంగాణ చేస్తానని చేయలేకపోయారని... దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు జాతీయ రాజకీయాల నినాదం ఎత్తుకున్నారంటూ తరుణ్‌చుగ్‌ ఎద్దేవా చేశారు.