తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాలపై బీజేపీ నేత తరుణ్ చుగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయనవన్నీ పగటి కలలేనన్న తరుణ్ చుగ్ .. జాతీయ పార్టీ రిజిస్ట్రేషన్ చేసుకునే హక్కు ఆయనకు కూడా వుందన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై (kcr) మండిపడ్డారు రాష్ట్ర బీజేపీ (bjp) వ్యవహారాల ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్ (tarun chugh) . శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జాతీయ పార్టీ ఏర్పాటుపై కేసీఆర్ (kcr) పగటి కలలు కంటున్నాడని ఎద్దేవా చేశారు. తెలంగాణలో మహిళలపై ఘోరమైన అత్యాచారాలు జరుగుతున్నాయని.. ముందు వాటిని అరికట్టడంపై కేసీఆర్ దృష్టి పెట్టాలని తరుణ్ చుగ్ హితవు పలికారు. ప్రభుత్వ వాహనాలలో రేప్ జరిగిందని.. ముఖ్యమంత్రి వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
రేప్ కేసును పక్కదారి పట్టించేందుకు అన్ని ప్రయత్నాలు చేశారని... రక్షక భటులే భక్షక భటులుగా మారారని తరుణ్ చుగ్ మండిపడ్డారు. వెయ్యి ఎలుకలను తిన్న పిల్లి పుణ్యం కోసం కాశీకి వెళ్లినట్టుగా కేసీఆర్ తీరు ఉందంటూ ఆయన సెటైర్లు వేశారు. దేశంలో వేలాది పార్టీలు ఉన్నాయని.. ఆయనకు కూడా జాతీయ పార్టీ రిజిస్ట్రేషన్ చేసుకునే హక్కు ఉందన్నారు. బంగారు తెలంగాణ చేస్తానని చేయలేకపోయారని... దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు జాతీయ రాజకీయాల నినాదం ఎత్తుకున్నారంటూ తరుణ్‌చుగ్ ఎద్దేవా చేశారు.
మరోవైపు.. మంత్రి కేటీఆర్ కు పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేయవద్దని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని కోర్టు ఆదేశించింది. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యపై గతంలో బండి సంజయ్ ట్వీట్ చేశారు. తన పరువు నష్టం కలిగించేలా బండి సంజయ్ ట్వీట్ చేశారని కేటీఆర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బహిరంగ క్షమాపణ చెప్పేలా బండి సంజయ్ ని ఆదేశించాలని కేటీఆర్ కోర్టును కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కేటీఆర్‌కు పరువు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేయవద్దని బండి సంజయ్ ను ఆదేశించింది. మీడియా, సామాజిక మాధ్యమాలు, సభల్లో కేటీఆర్ పై పరువునష్టం వ్యాఖ్యలు చేయవద్దని కోర్టు పేర్కొంది.
కాగా బండి సంజయ్ ఇంటివద్ద శుక్రవారం భారీగా పోలీసులు మోహరించారు. ఆయన జేబీఎస్ కు వెళ్లకుండా అడ్డుకునేందుకు పోలీసులు మోహరించారు. తెలంగాణ ఆర్టీసీ డీజిల్ సెస్ పేరుతో ప్రయాణికులపై భారం మోపడంపై బిజెపి శుక్రవారంనాడు నిరసనలకు పిలుపునిచ్చింది. జేబీఎస్ లో ప్రయాణికులతో ముఖాముఖీ కార్యక్రమానికి బీజేపీ ప్లాన్ చేసింది. ఈ కార్యక్రమానికి వెళ్లకుండా ఆపేందుకు పోలీసులు భారీ ఎత్తున బండి సంజయ్ ఇంటికి చేరుకున్నారు. పోలీసుల తీరును ఆయన తప్పుపట్టారు. ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని బండి సంజయ్ విమర్శించారు.
