నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కాన్వాయ్ పై దాడి ఘటనను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఖండించారు. ఇది పిరికిపంద చర్యేనని.. ప్రజాస్వామ్యవాదులంతా ఈ ఘటనను ఖండించాలని సంజయ్ అన్నారు. 

నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ కాన్వాయ్ పై దాడితో తెలంగాణలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. దీనిపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే భౌతికదాడులకు తెగబడుతున్నారని ఆయన ఆరోపించారు. అర్వింద్ పై దాడి ముమ్మాటికీ పరికిపంద చర్యేనని... ప్రజాస్వామ్యవాదులంతా ఈ ఘటనను ఖండించాలని సంజయ్ కోరారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి టైం దగ్గరపడిందని... అధికార పార్టీ నేతల బెదిరింపులకు భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఏం జరిగినా ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ పోరాడుతుందని బండి సంజయ్ స్పష్టం చేశారు. హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సైతం ధర్మపురి అర్వింద్ పై దాడిని ఖండించారు. ప్రజల్లో బీజేపీకి వస్తోన్న ఆదరణ చూసి తట్టుకోలేకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఈటల రాజేందర్ ఆరోపించారు. 

కాగా.. శుక్రవారం జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్రదండిలో ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలించేందుకు వచ్చిన ఎంపీ అరవింద్ ను గ్రామస్తులు, పలువురు నేతలు అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించి, ఆయన కారుపై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో అర్వింద్ కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. 

Also Read:ఎంపీని చెప్పుతో కొట్టాలంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ వ్యాఖ్యలు.. ఘాటుగా బదులిచ్చిన ధర్మపురి అర్వింద్

ఇకపోతే.. నిజామాబాద్‌ జిల్లాలో టీఆర్ఎస్ (trs) ఎమ్మెల్యే షకీల్ (trs mla shakeel) , బీజేపీ (bjp) ఎంపీ ధర్మపురి అర్వింద్ (dharmapuri arvind) మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ప్రజలు భారీ వర్షాలు, వరదలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే అర్వింద్ ఎక్కడున్నారని షకీల్ నిలదీశారు. సీఎం కేసీఆర్ ను విమర్శించడం తప్పించి ఆయన వేరే పని లేదా అంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే దుయ్యబట్టారు. సోషల్ మీడియాలో కామెంట్లు చేయడం తప్పించి.. కేంద్రం నుంచి తెలంగాణకు ఇంత వరకు ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదని షకీల్ దుయ్యబట్టారు. ఇంతటి క్లిష్ట పరిస్ధితుల్లో ప్రజలను పట్టించుకోకుండా తిరుగుతోన్న అర్వింద్ ను చెప్పుతో కొట్టాలంటూ ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఎంపీ అర్వింద్ స్పందిస్తూ.. పందిని పట్టించుకోనంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వం నివేదికలు పంపితే కేంద్రం సాయం చేస్తుందని.. కేసీఆర్ ప్రభుత్వానికి ఆ పని చేతకాదంటూ ఎద్దేవా చేశారు.