Telangana: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి పార్లమెంట్ సభ్యులు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఎంఐఎం (MIM) పార్టీపై మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలతో విరుచుకుపడ్డారు.
Telangana: తెలంగాణలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) దూకుడుగా ముందుకు సాగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని అధికార పార్టీ టీఆర్ఎస్‌తో పాటు కాంగ్రెస్, ఎంఐఎం, వామపక్ష పార్టీలపై విమర్శలతో పదును పెంచింది. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) .. పార్లమెంట్ సభ్యులు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఎంఐఎం (MIM) పార్టీపై మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలతో విరుచుకుపడ్డారు. ఎంఐఎం దేశద్రోహుల పార్టీ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యతిరేకులకు ఆ పార్టీ ఆశ్రయం కల్పిస్తున్నదని విమర్శలు గుప్పించారు.
వివరాల్లోకెళ్తే.. శనివారం నాడు భారత వీరత్వానికి ప్రతీక.. మొఘల్ సామ్రాజ్య పతనాన్ని శాసించిన మరాఠా సామ్రాజ్యపు యోధుడైన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి (Chatrapathi Shivaji Maharaj jayanthi) వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. తెలంగాణలోనూ శివాజీ జయంతి వేడుకలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులు ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి వేడులకు మేడ్చల్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay Kumar) మాట్లాడుతూ.. అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం (MIM) పార్టీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
పార్లమెంట్ సభ్యులు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఎంఐఎం (MIM) దేశ ద్రోహుల పార్టీ అంటూ బండి సంజయ్ ఆరోపించారు. ఎంఐఎం పార్టీ దేశ వ్యతిరేకులకు ఆశ్రయం ఇచ్చిందని విమర్శించారు. దేశ వ్యతిరేకులకు ఆశ్రయిం కల్పిస్తున్న ఎఐఎం.. వారిని ఇక్కడి సిటిజన్స్ గా గుర్తిస్తున్నదని పేర్కొన్నారు. “వారు (ఎంఐఎం నేతలు, కార్యకర్తలు) ఈ దేశ ఫలాలను అనుభవిస్తున్నారు. కానీ ఇతర దేశాలకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. అలాంటి దేశ ద్రోహ ఎంఐఎంను ఇక్కడి నుంచి ఎలా తరిమికొట్టాలో ఆలోచించాలి’’ అని అంటూ బండి సంజయ్ (Bandi Sanjay Kumar) వ్యాఖ్యలు చేశారు.
అలాగే, బీజేపీ పార్టీ మద్దతుదారులను టెలివిజన్ చూడటం మానేసి, తమ పిల్లలకు హిందూ ధర్మం గురించి మరియు హిందువులను రక్షించడానికి మొఘల్‌లకు వ్యతిరేకంగా పోరాడిన శివాజీ మహారాజ్ చరిత్ర గురించి అవగాహన కల్పించాలని కోరారు. శివాజీ మహారాజ్ జయంతిని జరుపుకోవడానికి పోలీసుల నుండి మాకు అనుమతి అవసరం కాబట్టి మేము దయనీయమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాము అని బండి సంజయ్ అన్నారు. బీజేపీ ఏ మతానికీ వ్యతిరేకం కాదనీ, ఎవరైనా హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా మాట్లాడితే సహించేది లేదని స్పష్టం చేశారు. "లవ్ జిహాద్ పేరుతో ఎవరైనా మన మహిళలకు సమస్యలు సృష్టించడానికి ప్రయత్నిస్తే మేము సహించాలా?" అంటూ ప్రశ్నించారు. తనను తాను హిందువుగా గుర్తించుకునే వారిని మతవాదులుగా పేర్కొనే ప్రయత్నం కూడా జరుగుతోందని ఆయన (Bandi Sanjay Kumar) అన్నారు. రాష్ట్రంలో అధికార పార్టీ టీఆర్ఎస్ పై కూడా బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ (TRS) రాక్షస పాలన కొనసాగిస్తున్నదని విమర్శించారు.
