హైదరాబాద్: కోఠీలోని కరోనా కమాండ్ కంట్రోల్ సెంటర్ ముట్టడికి సోమవారం ఉదయం బిజెపి నాయకులు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే తెలంగాణ బిజెపి అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తో పాటు ఇతర బిజెపి నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

కరోనా కట్టడి విషయంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందిన బిజెపి ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వంలో కదలిక వచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ హాస్పిటల్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ముందు ధర్నా చేపట్టాలని తెలంగాణ బిజెపి పిలుపునిచ్చింది. 

read more  ఆస్పత్రుల ముందు ధర్నాలకు పిలుపు.. బిజీపీ నేతల ముందస్తు అరెస్టులు..

ఈ క్రమంలోనే కోఠీలోని డిఎంఈ కార్యాలయం వద్ద బండి సంజయ్ ధర్నాకు దిగారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు సంజయ్ తో పాటు బిజెపి కార్యకర్తలను అరెస్ట్ చేశారు. అంతకు ముందే కొందరు బిజెపి నాయకులను ఇళ్లనుండి బయటకు రాకుండా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. 

అరెస్ట్ అనంతరం సంజయ్ మాట్లాడుతూ... కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్‌ టెస్టుల సంఖ్యను పెంచాలని సూచించారు. ప్రస్తుతం వైద్య సిబ్బందిపై పనిభారం ఎక్కువగా వున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖలోని ఖాళీలను వెంటనే భర్తీ చేయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సంజయ్.