హైదరాబాద్: తెలంగాణ బీజేపీ నాయకత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్. శాసన సభాపక్ష నేతగా తనను గుర్తించడం లేదని గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. తనకు కనీస సమాచారం ఇవ్వకుండానే బీజేపీ నేతలు తన నియోజకవర్గంలో పర్యటిస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. 

కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి అసలు ప్రోటోకాల్ పాటించడం లేదని ఆరోపించారు. తనకు సమాచారం ఇవ్వకుండా తన నియోజకవర్గంలో పర్యటిస్తున్నారని అది ఎంతవరకు సబబు అంటూ నిలదీశారు. 

ప్రస్తుత హిమాచల్ ప్రదేశ్ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత దత్తాత్రేయ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు ప్రొటోకాల్ పాటించేవారని గుర్తు చేశారు. తన నియోజకవర్గంలో గానీ ఎక్కడైనా పర్యటించేటప్పుడు ముందస్తు సమాచారం ఇచ్చేవారని చెప్పుకొచ్చారు. 

ఇకపోతే బీజేపీ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి ఓడిపోవడానికి తన పదవే కారణమని చెప్పుకొచ్చారు. అధ్యక్ష పదవి ఆయన గెలుపుపై ప్రభావం చూపించిందని రాజాసింగ్ స్పష్టం చేశారు. 

బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో మార్పులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షపదవిపై తనకు ఎలాంటి ఆశలు లేవన్నారు. ఒకవేళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మారిస్తే ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి ఎంపీ అరవింద్, డీకే అరుణలు అర్హులు అంటూ చెప్పుకొచ్చారు.

తనకు రాజకీయ గురువు, మార్గదర్శి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ అని స్పష్టం చేశారు. గో సంరక్షణ, హిందూ ధర్మం తనకు సంతృప్తిని ఇస్తాయని ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు.   

పవన్... మతం మార్చకున్నావా.. రాజాసింగ్ వార్నింగ్