బీజీపీ (bjp) తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ (bandi sanjay) నల్గొండ జిల్లా పర్యటన సందర్భంగా జరిగిన దాడులకు సంబంధించి ఆ పార్టీ నేతలు మంగళవారం గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌ను (Tamilisai Soundararajan) కలిసి ఫిర్యాదు చేశారు.

బీజీపీ (bjp) తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ (bandi sanjay) నల్గొండ జిల్లా పర్యటన సందర్భంగా జరిగిన దాడులకు సంబంధించి ఆ పార్టీ నేతలు మంగళవారం గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌ను (Tamilisai Soundararajan) కలిసి ఫిర్యాదు చేశారు. బండి సంజయ్ కాన్వాయ్‌పై జరిగిన దాడికి గవర్నర్‌కు వివరించారు. గవర్నర్‌ను కలిసివారిలో బీజేపీ నేతలు డీకే అరుణ, ఈటల రాజేందర్, లక్ష్మణ్, ఇతర ముఖ్య నేతలు ఉన్నారు. గవర్నర్ కలిసిన అనంతరం డీకే అరుణ (dk aruna) మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ తన స్థాయికి తగని భాషను వాడుతున్నారని మండిపడ్డారు. బెంగాల్ తరహా రాజకీయం చేయాలని కేసీఆర్ చూస్తున్నారని.. సీఎం తీరును గవర్నర్‌కు వివరించినట్టుగా చెప్పారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలవడానికి కేసీఆర్ వేల కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. హుజురాబాద్ ఉప ఎన్నిక వచ్చినందుకే పథకాలు వచ్చాయని ప్రజలు భావించారని అన్నారు. అందుకే నిర్ణయాత్మక తీర్పును ఇచ్చారని చెప్పుకొచ్చారు. హుజురాబాద్‌ తీర్పుపై ప్రజలు సంబరాలు చేసుకున్నారని అన్నారు. 

లక్ష్మణ్ మాట్లాడుతూ.. బండి సంజయ్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టుగా చెప్పారు. బీజేపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను కూడా గవర్నర్‌కు వివరించినట్టుగా తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్రమంగా క్షీణిస్తున్నాయని అన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక తర్వాత సీఎం కేసీఆర్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రైతులకు భరోసా కల్పించడానికి వెళ్లిన బండి సంజయ్‌పై దాడి చేస్తారా..? అని ప్రశ్నించారు. హుజురాబాద్ ఉప ఎన్నిక ఓటమిని జీర్ణించుకోలేక ఆ ఆవేశాన్ని రైతులపై ప్రయోగించడం సరైనది కాదని అన్నారు. వానాకాలంలో 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కొనేందుకు కేంద్రం సిద్దంగా ఉందని అన్నారు. 

Also read: Bandi Sanjay: తెలంగాణలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి.. నిన్న 8 వాహనాలు ధ్వంసం అయ్యాయి.. బండి సంజయ్

ఈటల రాజేందర్ (etela rajender) మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన 7 ఏళ్ల నుంచి రాష్ట్రంలో పండిన ధాన్యం కేంద్రమే కొనుగోలు చేసిందని అన్నారు. ధాన్యం కొనుగోళ్లపై కేసీఆర్ ఇన్నాళ్లు గొప్పలు చెప్పుకున్నారని విమర్శించారు. 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కొంటామని కేంద్రం హామీ ఇచ్చిందని తెలిపారు. బండి సంజయ్‌పై రాళ్లతో, గుడ్లతో దాడి చేయడం హేయమైన చర్య అని అన్నారు. కావాలనే సీఎం రైతులను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. ధాన్యం కొనుగోలు చేసి రైతులను తక్షణమై ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బెంగాల్‌ తరహాలో తెలంగాణలో చేయాలని అనుకుంటే కుదరదని.. తెలంగాణ మంచికి, నీతికి విలువనిస్తారని అన్నారు.