ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మీద ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలను బిజెపి తెలంగాణ నేత విజయశాంతి తప్పు పట్టారు. ఈ పౌరుషం ఆనాడేమైందని ఆమె ఓవైసీని ప్రశ్నించారు.

హైదరాబాద్: ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ పై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై బిజెపి తెలంగాణ నేత, సినీ నటి విజయశాంతి విరుచుకుపడ్డారు. ఇస్లాం వ్యతిరేకత లేదని, భయం లేకుండా ఉండాలని మోహన్ భగవత్ ముస్లింలను ఉద్దేశించి అన్నారు. దానిపై మోహన్ భగత్ మీద అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ట్విట్టర్ వేదికగా విజయశాంతి అసదుద్దీన్ ఓవైసీని తప్పు పట్టారు. భారతదేశ సమగ్రతను, సమైక్యతను చాటి చెప్పే విధంగా మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించిన తీరు చూస్తుంటే రామ అనే పదం కూడా కొంత మంది అవకాశవాదులకు బూతుగా వినిపిస్తుందనే సామెత నిజమైందేమో అనే అనుమానం కలుగుతోందని ఆమె అన్నారు. 

దేశంలో ముస్లీంలతో పాటు మైనార్టీ వర్గాల ప్రజలపై కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్న మూక దాడులను ఖండించడంతో పాటు ఈ రకమైన దాడులకు పాల్పడేవారు హిందూత్వ సిద్ధాంతాలకు వ్యతిరేకమని మోహన్ భగవత్ సదుద్దేశంతో అభిప్రాయం వ్యక్తం చేశారని, దాన్ని అర్థం చేసుకోలేని స్థితిలో అసదుద్దీన్ ఓవైసీ ఉండడం చాలా విడ్డూరమని విజయశాంతి అన్నారు. 

తొలుత భారతీయులుగా ఉన్నవారే మారుతున్న పరిస్థితుల్లో ముస్లింలుగాను, ఇతర మైనారిటీ వర్గాల వారిగా మారారని, ఎవరు ఏ మతంలో ఉన్నా అందరం భారతీయులమేనని మోహన్ భగవత్ సమైక్యతను చాటి చెప్పారని ఆమె అన్నారు. మోహన్ భగవత్ మాటలు అసదుద్దీన్ ఓవైసీ దృష్టిోల నేరస్తులు చేసే వ్యాఖ్యలుగా కనిపించాయని ఆమె తప్పు పట్టారు. 

తరుచుగా హిందూ ముస్లింల మధ్య మత విద్వేషాలను రెచ్చగొట్టే ఎంఐఎం నేతల ప్రసంగాలను విని ఆనందిస్తూ అలవాటు పడిపోయిన అసదుద్దీన్ ఓవైసీకి భగవత్ అభిప్రాయం క్రిమినల్ ఆలోచనగానే కనిపిస్తుందని ఆమె అన్నారు. 

భగవత్ వ్యాఖ్యలను తప్పు పడుతున్న ఓవైసీ గతంలో తన సోదరుడు అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకోవాలని ఆమె అన్నారు. అక్బరుద్దీన్ ఓవైసీ విద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగం చేసినప్పుడు అసదుద్దీన్ ఓవైసీ ఎందుకు నోరు మెదపలేదని ఆమె ప్రశ్నించారు. ఇప్పుడు మోహన్ భగవత్ మీద చూపించిన పౌరుషం ఆనాడేమైందని ఆమె అడిగారు. ఈ సందర్భంగా ఆమె అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలను కూడా ప్రస్తావించారు.